ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా వెలికితీశారు.
ఆ వజ్రం 2492 క్యారెట్ల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
బోట్స్వానాలోని కరోవే గనిలో ఈ వజ్రాన్ని.. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ అనే సంస్థ.. కనుగొంది.
ఇది ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమెండ్ కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్-రే డిటేక్షన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వజ్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ఈ భారీ వజ్రం విలువ, నాణ్యతకు సంబంధించిన వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఈ అతి పెద్ద 2492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ఎంతో సంతోషంగా ఉందని లుకారా డైమండ్ కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ పేర్కొన్నారు.
1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన 3106 క్యారెట్ల కల్లినల్ వజ్రమే ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రంగా నిలిచింది. అయితే తాజాగా లభించిన ఈ వజ్రం.. రెండో అతిపెద్దదిగా నిలిచినట్లు లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ కల్లినల్ వజ్రాన్ని 9 ముక్కలు చేశారని.. వీటిలో కొన్ని జెమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపింది.