విల్లాస్లోకి వరద నీరు… కబ్జా వల్లే ఈ స్థితి అంటూ…
రంగారెడ్డి జిల్లా :
చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విల్లాస్. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నారు. రోడ్లపై వర్షపు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘‘La Paloma Villas’’లోకి వరద నీరు వచ్చి చేరింది. వరదలకు సుమారు 200 విల్లాస్ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అయితే కాలువల కబ్జా వల్లే ఈ స్థితి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగు ప్రక్కనే ఉన్న విలాల్లోకి వరద నీరు చేరింది. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడం వల్లే ఈ విల్లాస్లోకి వరద నీరు వచ్చి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇలా వరద నీరువిల్లాస్లోకి రావడం సర్వ సాధారణమని.. ఇప్పుడు ఎక్కువ వర్షం కురవడంతో ఎక్కువ నీరు చేరిందని స్థానికులు తెలిపారు.
కూల్చివేతలకు బ్రేక్…
మరోవైపు చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కూల్చివేతలకు హైడ్రా కాస్త బ్రేక్ ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు బిజీ ఉన్నాయి. అలాగే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా బిజీగా ఉన్నారు. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన్ పాయింట్స్, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీల్లో పర్యటిస్తున్నారు. నీరు ఉన్నప్పుడే ఆ ప్రాంతాలను సందర్శించి మార్క్ చేసుకుంటున్నారు. తర్వాత నోటీసులు అందజేసే అవకాశం ఉంది.
అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారికి ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు తీసుకున్న వారు వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని అందులో స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే 200కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. అందులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఉంది. తర్వాత కేటీఆర్ జన్వాడా ఫామ్ హౌస్, అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి చెందిన ఇల్లు, ఆఫీసుకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు అందజేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూల్చివేతల పనిలో హైడ్రా బిజీగా ఉండనుంది