ఖాకీలను కలవరపెడుతున్న వరుస ఘటనలు… 15రోజుల్లో ఐదుగురిపై వేటు…!!

ఖాకీలను కలవరపెడుతున్న వరుస ఘటనలు… 15రోజుల్లో ఐదుగురిపై వేటు…!!

వరుస ఘటనలు ఆ జిల్లాలో పోలీసులను కలవరపెడుతున్నాయి. కేవలం 15రోజుల వ్యవధిలోనే ఐదుగురు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. ఇల్లీగల్ వ్యవహారాలు, రాజకీయ జోక్యానికి ఖాకీలు బలవుతున్నారు.

దీంతో ఆ జిల్లాలో పోలీసులకు ఎప్పుడూ ఏ ఉపద్రవం ముంచుకోస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఖాకీల లీలలపై జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసుల వ్యవహారం సంచలనంగా మారింది. ఎప్పుడూ ఎదో అంశంలో కీలకంగా వ్యవహరిస్తూ వార్తలోకి ఎక్కుతున్నారు. ఇటీవలే పోలీస్ ఉన్నతాధికారుల చర్యలు గద్వాల్ ఖాకీల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. అయితే అనవసర రాజకీయ వ్యవహారాలు, ఇల్లీగల్ దందాల్లో జోక్యం చేసుకుంటుడంతో విచారణలు అనంతరం చర్యలు తప్పడం లేదు.

పేకాటలో ఖాకీల చేతివాటం ఆరోపణలు..

జిల్లాలోని ఉండవల్లి సమీపంలో పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. స్వాధీనం చేసుకున్న నగదులో కొంత మాత్రమే చూపించారని ఆరోపణలు వినిపించాయి. పేకాట స్థావరంపై దాడి అనంతరం నగదుతోపాటు బంగారు ఆభరణాలు లాక్కున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రహస్యంగా అంతర్గత విచారణ చేసిన అనంతరం గత నెల 21వ తేదీన వారిపై చర్యలు తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ జములప్ప, ఎస్సైలు విక్రం, శ్రీనివాసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీంతో సీఐ జములప్ప మల్టీజోన్ 2 కు, ఎస్సై విక్రంను మహబూబ్ నగర్ ఎస్పీకి, శ్రీనివాసులను జోగుళాంబగద్వాల్ జిల్లా ఎస్పీకి రిపోర్ట్ చేయాలని అదేశాలు జారీ చేశారు.

రాజకీయ రచ్చకు సీఐ, ఇల్లీగల్ ఆరోపణలకు ఎస్సై..

ఇక గద్వాల్ సీఐ భీమ్ కుమార్ రాజకీయ రచ్చకు బలయ్యాడు. గత నెల 18వ తేదిన మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకున్న ఘటనలో నిర్లక్ష్యంగా వ్యహరించారని సీఐ భీం కుమార్ ను మల్టీజోన్ 2 వీఆర్ కు అటాచ్ చేశారు ఐజీ సత్యనారాయణ. అయితే వాస్తవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ సరితా తిరుపతయ్య వర్గ పోరుకు సీఐ బలయ్యాడని టాక్ నడుస్తోంది. జూపల్లి పర్యటనలో భాగంగా జరిగిన ఓ ఘటనలో ఎమ్మెల్యే బండ్ల బావమరిది మోహన్ రెడ్డిపై సీఐ భీమ్ కుమార్ కేసు నమోదు చేశాడని ప్రచారం సాగింది. దీంతో ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకే సీఐపై చర్యలు తీసుకున్నారని పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.

ఇక మరో ఎస్సై నాగరాజుపై ఇల్లీగల్ ఎఫైర్ ఆరోపణలు ఇటివలే జిల్లాలో సంచలనం రేపాయి. అలంపూర్ పీఎస్ లో ఎస్సై నాగరాజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కర్నూల్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్ జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నాగరాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ యవ్వారంపై స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను మహబూబ్ నగర్ వీఆర్ కు బదిలీ చేశారు.

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పోలీసుల వరుస వ్యవహారాలు ఉమ్మడి జిల్లాలోనే సంచలనంగా మారాయి. కొద్దిరోజుల్లోనే ఐదుగురు ఖాకీలపై చర్యలు మొత్తం డిపార్ట్‌మెంట్ నే షేక్ చేస్తున్నాయి.