42% కోటా ఉత్తమాటే…?

42% కోటా ఉత్తమాటే…?

బీసీ రిజర్వేషన్‌ పెంచకుండానే స్థానిక ఎన్నికలు…?

పార్టీల వారీగా సీట్లిద్దామనే ప్రతిపాదన తెరపైకి కోర్టుకెళ్లి అనుమతి తీసుకునే యోచనలో సర్కార్‌ కొత్త బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తే మరింత జాప్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరితో గందరగోళం
బీసీల పోరాటంపై పట్టింపేది?: ప్రజాసంఘాలు.

హైదరాబాద్‌ :

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ఉత్తమాటేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్‌ పెంపు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదనే సంకేతాలే కనిపిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. జూలైలో మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాల పరిమితి ముగిసింది. సకాలంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ కారణంగా కేంద్రం ఆర్థిక సంఘం నిధులను నిలుపుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు బీసీ కులగణన, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హామీలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టకపోవడంతో స్థానిక ఎన్నికల్లో అసలు రిజర్వేషన్లను పెంచుతారా, లేదా? అన్న అనుమానం బీసీ వర్గాలను వెన్నాడుతున్నది. ప్రభు త్వం తగిన కార్యాచరణ చేపట్టకపోవడంతో అనుమానం కలిగిన బీసీ సంఘాల నేతలు వివిధ రూపాల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తున్నారు. 42% రిజర్వేషన్ల సాధనే ప్రధాన డిమాండ్‌గా ఆమరణదీక్షలూ కొనసాగుతున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ హామీ ఏమైందని ప్రజా ప్రతినిధులను, మంత్రులను బీసీ సంఘాలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ కామారెడ్డి డిక్లరేషన్‌ మేరకు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% కోటాను ప్రభుత్వపరంగా అమలు చేయకపోతే పార్టీపరంగా 42% స్థానాలు బీసీలకు ఇస్తామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి తాజాగా సెలవిచ్చారు. దీనిపై బీసీ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త కమిషన్‌తో మరింత జాప్యం

బీసీ నేత డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారథ్యంలో బీసీ కమిషన్‌ను గత ప్రభుత్వం నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించడానికి, సుప్రీంకోర్టు ఈ కమిషన్‌కే బాధ్యతలను అప్పగించింది. రేవంత్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పలు సిఫారసులను, అధ్యయన పత్రాలను ఈ కమిషన్‌ అందజేసింది. వకుళాభరణం కమిషన్‌ సిఫారసులతోనే, రేవంత్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేపట్టడానికి చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రెండుసార్లు ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించినా రిజర్వేషన్‌ పెంపుపై స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తెలుపలేదు. ఇంతలో ఆగష్టు 31న కమిషన్‌ మూడేండ్ల పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్‌ సీనియర్లు, మంత్రులు కూడా కమిషన్‌ను కొనసాగించాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ కాంగ్రెస్‌ కొత్త పాలకమండలి నియామకం వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉన్నది.

సీఎం రేవంత్‌రెడ్డి వైఖరితో గందరగోళం

సాధారణంగా ఒక నిర్దిష్టమైన అంశంపై కమిషన్‌ను నియమించినప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు గడువు పెంచుతూ నివేదికలు స్వీకరించే ఆనవాయితీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంప్రదాయం. తాజాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్‌గా జయప్రకాశ్‌ హెగ్డేతో బీసీ కమిషన్‌ పాలకమండలి ఏర్పడింది. సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ హెగ్డే కమిషన్‌ గడువును పెంచి కులగణనకు సంబంధించిన పూర్తి నివేదికను ఇటీవలే స్వీకరించింది. ఇదే కోవలో రేవంత్‌ ప్రభుత్వం కూడా వకుళాభరణం కమిషన్‌ను కొనసాగించి ఉండాల్సిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీసీ కమిషన్‌కు కొత్త పాలకమండలి నియామకం ఎప్పుడు అవుతుందో, ఈ పాలకమండలి అనుభవం గడించడానికి ఎన్ని నెలలు పడుతుందో, నివేదిక ఎప్పుడు ఇస్తుందో, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో.. మొత్తానికి అంతా గందరగోళ వాతావరణం నెలకొందన్నదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.