మూడు జోన్లుగా హైడ్రా… ఎస్పీ స్థాయి అధికారికి ఒక్కో జోన్ బాధ్యత… త్వరలో ఆర్డినెన్స్ జారీకి న్యాయశాఖ కసరత్తు
ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు
విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండీఏ వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ను సెంట్రల్ జోన్, సైబరాబాద్ ను నార్త్ జోన్ గా , రాచకొండను సౌత్ జోన్ గా విభజించనుంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్ చేసిన నేపథ్యంలో… ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ వివరించారు. ఈ మేరకు వారం, పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు పని చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టనుంది.
దేశంలోనే నాలుగో ప్రత్యేక ఠాణా
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా తీసుకురానుంది. సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోది అవుతుంది. పార్లమెంటు భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీసు స్టేషన్(స్టేషన్ హౌస్ ఆఫీసర్-ఎసెవ్వో) ఉంది. ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీసు వ్యవస్థ. ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, నార్కొటిక్స్ విభాగాలకు రెండు ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు. హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్ఎస్వో వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది.
ఇకపై అక్రమ నిర్మాణ ప్రాంతమంతా స్వాధీనం
అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేసేందుకు పురపాలక శాఖ చట్టంలోనూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చుమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని, వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. భవన అనుమతులు జారీ చేసేప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో పది శాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ వారు నిబంధనలను అతిక్రమిస్తే ఆ 10% ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు సంబంధిత కట్టడాన్ని కూల్చేస్తుంది. ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటం గమనార్హం.