వెలుగొండ పూర్తయితే… ‘కృష్ణా’కు వరద ముప్పు తగ్గేది…!!

టిడిపి కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందా?

శ్రీశైలం జలాశయం నుంచి రెండు సొరంగాల ద్వారా నీటిని తరలించి వెలుగొండ రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండే ముందు అంటే గేట్లు ఎత్తే సమయంలో ఉండే వరద నీటిని వెలుగొండ ప్రాజెక్టుకు రోజుకు ఒక టిఎంసి చొప్పున 40 రోజుల్లో 40 టిఎంసిలు తరలించాలనేది ప్రాజెక్టు ప్లాన్‌. ప్రస్తుతం అన్ని సాగునీటి ప్రాజెక్టులూ నిండిపోయాయి.

వెలుగొండకు మాత్రం నీటిని తరలించే అవకాశం ప్రస్తుతం లేదు. రెెండో సొరంగంలో 6,834 మీటర్లు, మొదటి సొరంగంలో 1,053 మీటర్లు పొడవున లైనింగు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు, 15.25 లక్షల మందికి తాగునీటి సమస్య తీరేది. కృష్ణా నదికి వరద ముప్పు ఎంతోకొంత తప్పేది. వెలుగొండ ప్రాజెక్టును ఈ ఏడాది ఎన్నికలకు ముందు అప్పటి సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారు.

అయితే, పనులు పూర్తి కాలేదు. మొదటి ఏడాదిలోనే వెలుగొండను పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చాక జగన్‌ చెప్పారు. ఐదేళ్లకూ పూర్తి చేయలేదు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. దిగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆదివారం నాడు కూడా శ్రీశైలం, సాగర్‌, పులిచింతల గేట్లు ఎత్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఇప్పుడున్న వరద నీటితో ఈ ఏడాది నిండిపోయేది. మూడు జిల్లాలకు ప్రయోజనం కలిగేది.

పరిహారం, పునరావాసం ఏదీ…?

రిజర్వాయర్‌ పరిధిలో 11 ముంపు గ్రామాల్లో ఏడు వేల మంది నిర్వాసితులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం నేటికీ పునరాసం కల్పించలేదు. ప్యాకేజీలు ఇవ్వలేదు. కాలనీలు కేటాయించారే తప్ప, అక్కడ ఇళ్లు కట్టించలేదు. కనీసం సౌకర్యాలు కల్పించలేదు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంటు కింద ఒక్కో నిర్వాసితుడికి రూ.12.50 లక్షలు ఇచ్చి పంపాలని నిర్ణయించారు. ఇందుకు నిధులు విడుదల కాక ఈ ప్రక్రియ పెండింగులో పడింది. 2023-24 బడ్జెట్లో దీనికి కేవలం రూ.101.47 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఓటాన్‌ బడ్జెట్లో రూ.1544.07 కోట్లు చూపారు. ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండానే దీన్ని ప్రారంభించినా టిడిపి కూటమి ప్రభుత్వం ఇంకా దీనిపై దృష్టి సారించలేదు.