చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే…!!
గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది.
ఇది నేటి తరానికి పెద్దగా తెలియదు.ఆరోగ్యకరమైన జ్ఞాపకాలను,చరిత్ర ను ఎత్తిచూపాల్సిన బాధ్యత నేటి పౌర,లౌకిక, సామాజిక శక్తులపై ఉంది. బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవులు నడిపిన విప్లవం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.
హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ పల్లెల్లో భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాన్ని నడిపి కత్తుల వంతెన మీద కవాత్తు చేసి తెలంగాణ పటాన్ని ప్రపంచ పటంలో నిలిపిన తెలంగాణ రైతాంగ పోరాటానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.1947 ఆగస్ట్ 15 కి ముందు భారతదేశం రెండు ప్రాంతాలుగా ఉంది.ఒకటి వలస ప్రాంతాల ఆధీనంలో (పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిష్) ఉన్న ప్రాంతం.రెండు స్వదేశీ సంస్థానాల పేరుతో స్ధానిక పాలకుల ఆధీనంలో ఉన్న ప్రాంతం.నాటి భారతదేశంలో 560 పైగా రాజ్యాలు ఉండేవి.వాటిల్లో అతి పెద్ద సంస్థానం హైదరాబాద్.అయితే స్వాతంత్ర్య పోరాట వెలుగులు సంస్ధానాల చీకటి ప్రాంతాలకు చేరి ప్రజలల్లో ఆశలు రెకెత్తించాయి.ట్రావెన్ కోర్,కొచ్చిన్,జమ్మూ కాశ్మీర్,హైదరాబాద్,మణిపూర్ ప్రాంతాలల్లో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు జరిగాయి. దాదాపుగా రెండు శతాబ్దాల పాటు హైదరాబాద్ రాజ్యం అసఫ్ జాహీ పాలనలో ఉండేది.
సామాజిక పరంగా, సంస్కృతి పరంగా సమ్మిళిత జీవనానికి హైదరాబాద్ రాజ్యం చిహ్నం.బ్రిటిష్ ఇండియాలో మాదిరిగానే స్వదేశీ సంస్థానాలలో ప్రజాస్వామిక రాజకీయాలు చాలా తక్కువ.బాంచన్ కాల్మోక్కుతా అంటూ కష్టాలు,కన్నీళ్లు,వెట్టిచాకిరి,దౌర్జన్యాలు, అత్యాచారాలు,అవమానాలు ఎక్కువగా ఉండేవి.పాలకుడు ముస్లిం అయినప్పటికీ అతనికి లభించిన మద్దతు అంతా హిందూ సంస్థానాధీశులు,జమీందారులు,జాగీర్ధార్లే. ఇందులో 60 శాతం పైగా భూభాగం హిందూ భూస్వాములు అధీనంలో ఉన్నది.30 శాతం పైగా భూభాగం ముస్లిం జమీందారుల ఆధీనంలో ఉండేది.వీరికి భూమి నుంచి వొచ్చే ఆదాయం మాత్రమే కాదు.న్యాయపరమైన,చట్ట సంబంధమైన అధికారాలు ఉండేవి. భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా నల్లగొండ యోధులు వెలిగిన ధిక్కార స్వరాలు తెలంగాణ అంతటా విస్తరించాయి.దొరలను తరిమి కొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉంది.1921లో ఊపందుకున్న ఈ ఉద్యమాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి.
నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా,బానిస సంకెళ్ల విముక్తే లక్ష్యంగా కదనరంగంలోకి దిగాయి.పల్లెలన్ని పోరాట కేంద్రాలుగా మారాయి.జనం స్వచ్ఛదంగా ముందుకువచ్చారు. సామాన్యులే ముందుడి పోరాడారు. మహిళలు కూడా తుపాకీలు ఎత్తి… భూస్వామ్యులపైకి గురి పెట్టారు.కారంపొడి,రోకలిబండ,గుతపలను చేతబట్టి ఎదురుదాడికి తెగబడ్డారు.ఈ క్రమంలోనే బైరాన్ పల్లి గ్రామం నెత్తుటితో తడిచిపోయింది.కొమురయ్య,చిట్యాల ఐలమ్మ,షేక్ బందగీ వంటి వారు తొలి తరం అమరులు గా నిలిచారు.దున్నే వాడికే భూమి అనే నినాద స్ఫూర్తితో భువనగిరి,హుజూర్ నగర్, పోచంపల్లి, వలిగొండ, సూర్యాపేట, నల్లగొండలు ఉద్యమ కేంద్రాలుగా వెలిశాయి.దేవులపల్లి వెంకటేశ్వరరావు,రావినారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలమ్మ భీం రెడ్డి నరసింహ రెడ్డి,ధర్మ భిక్షం,మగ్ధుం మోహీనుద్దిన్,వంటి నేతలు ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు.వీరి పోరాట నాయకత్వం పై విశ్వాసం పెరిగి ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయడం మొదలు పెట్టారు.మట్టి మనుషులను తట్టిలెపాయి.ఆలోచనలే పునాదుల అయ్యాయి.పనిముట్లే ఆయుధాలయ్యాయి.
గడ్డి కోసిన చేతులే గొడ్డలను ఎత్తాయి..దండం పెట్టిన చేతులే కొడవళ్లను పట్టాయి.బంచాన్ దొర కాల్మొక్తా అన్న గొంతులే భూస్వాములు,పటేళ్లు, దొరల అరాచాకలపై గర్జించాయి.ఈ పరిణామాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారాయి. సెప్టెంబరు 13, 1948 తర్వాత, యూనియన్ సైన్యాలు వ్యవసాయ విప్లవం జరుగుతున్న తెలంగాణ జిల్లాలోకి ప్రవేశించి వశపరుచుకోవడం మొదలు పెట్టారు.ఉద్యమాన్ని,పార్టీని మరియు గెరిల్లా దళాలను తూడిచిపెట్టడానికి యూనియన్ సైన్యాలు నిర్బంధకాండలకు తెరలేపాయి. నిర్బంధాలు,చిత్రహింసలు, గ్రామాలను తగులబెట్టడం,హత్యలు (కాలబెట్టి చంపడం) భారీ స్థాయిలో జరిగాయి.భారత సైన్య నిర్వహణ రికార్డుల ప్రకారం,జనరల్ చౌదరి నాయకత్వం లో సెప్టెంబరు 18న సాయంత్రం 4 గంటలకు మేజర్ జనరల్ ఎల్.ఎడ్రూస్ నేతృత్వంలోని హైదరాబాద్ నిజాం సైన్యం లొంగిపోయింది.తర్వాత నిజాం రాజ్ ప్రముఖ్ గా నియమింపబడ్డాడు.కాని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1951 వరకు కొనసాగింది.
1947 సెప్టెంబర్ 17 కు ముందు తెలంగాణకు పోరాట చరిత్ర ఉంది.1947 సెప్టెంబర్ 17 తర్వాత కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది.సెప్టెంబర్ 17 అనేది మతోన్మాద శక్తులు అల్లుతున్న ఒక కల్పిత కథ. వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియపరచకుండా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సెప్టెంబర్ 17 కు ఒక మత రంగు పులిమి సెప్టెంబర్ 17 తో సంబంధం లేని విచ్ఛిన్నకరశక్తులు విమోచనమనే పేరుతో తెరమీదకి తీస్తున్నారు. భూస్వాములు మరియు నిజాం రాజు కలిసి ఆనాటి పటేల్ తో అంతర్గత ఒప్పందం చేసుకొని ఆపరేషన్ పోలో పేరుతో లక్షలాది సైన్యాలను హైదరాబాదును మరియు హైదరాబాదు ప్రాంతంలోని గ్రామాలను చుట్టుముట్టి నిజాం కు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టులను గుతప సంఘాల నాయకులను లక్షాలాదిమంది సామాన్య ప్రజలను కాల్చి చంపిన చరిత్ర పటేల్ సైన్యానిది.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎంతో మంది త్యాగాలను మట్టిగరిపించి లక్షలాది ఎకరాల భూములను పటేల్ సైన్యం స్వాధీనం చేసుకొని భూస్వాములకు అప్పజెప్పడం విమోచనమో.! విలీనమో.! మతతత్వ శక్తులు స్పష్టం చేయాలి. విమోచనమో విలీనమో అనడానికి జరిగిన ఒప్పందం ఏమిటో కూడా ప్రజల ముందు ఉంచాలి. విమోచన జరిగింది తెలంగాణ భూస్వాములకు నిజాం నిరంకుశ రాజకు మాత్రమే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.వాస్తవికమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.చరిత్ర చెప్పిన సత్యం ముమ్మాటికి సెప్టెంబర్ 17న నయవంచకులైన పాలకులు సృష్ఠించుకున్న తారీఖు, తెలంగాణ ప్రజలకు జరిగిన ఒక విద్రోహ దినం మాత్రమే.