ఈడీ విచారణకు కవిత…!!!

ఈడీ విచారణకు కవిత…!

అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి కేటీఆర్, హరీష్.. ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..!

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం నాడు మరోసారి ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ప్రస్తుతం కవిత ఢిల్లీలోనే ఉన్నారు. ఆమెతో పాటు భారత్ జాగృతి మహిళా నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉంటున్నారు. అయితే.. ఇవాళ అర్ధరాత్రి స్పెషల్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు , శ్రీనివాస్ గౌడ్‌తో  పలువురు ముఖ్య నేతలు ఢిల్లీ బయల్దేరుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మంత్రులు బయల్దేరి వెళ్తున్నారు. కవితకు భరోసాను ఇవ్వడానికి కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్తున్నారు. మొదటిసారి విచారణప్పుడు కూడా ఈ ఇద్దరు మంత్రులూ ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు మంత్రులు వెళ్తున్నట్లు తెలియవచ్చింది. ఢిల్లీ వెళ్లే ముందు ఈ మంత్రులంతా కేసీఆర్‌తో భేటీ అవుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కవిత ఇప్పటికే విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మళ్లీ విచారణకు వెళ్లడం.. ఇప్పుడు మంత్రులు అర్ధరాత్రి పయనం అవుతుండటం ఈ మొత్తం పరిణామాలను చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు అసలు ఢిల్లీలో గురువారం నాడు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పెరిగిపోయింది.

ఏం జరగబోతోంది…!

మార్చి 11న విచారణకు హాజరైన కవితను 9 గంటల పాటు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కవిత ఫోన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో గురువారం విచారణలో ఏమేం పరిణామాలు చోటుచేసుకుంటాయో అని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కాగా.. గత విచారణలో కవితను ఒంటరిగా మాత్రమే విచారించారని ఈసారి.. అరుణ్ రామచంద్రపిళ్లై, బుచ్చిబాబులతో కలిసి కవితను ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కవితకు పిళ్లై బినామీ అన్నది ఈడీ ఆరోపణ. ఇప్పటికే కవిత-పిళ్లై  మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ కీలక సమాచారమే సేకరించిందని తెలుస్తోంది. కవితను అధికారులు ఏమేం అడగబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ముందు రోజు ఇలా…!

బుధవారం నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో 8 గంటలుగా పైగా కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులు, అరుణ్ పిళ్ళై సహా నిందితులతో ఉన్న సంబంధాలపై మొదట గోరంట్ల బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విడిగా ప్రశ్నించిన తర్వాత లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో సంబంధాలు, లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్ర, ఢిల్లీలో ఏమేం చేశారో ఇద్దరిని ఈడి ప్రశ్నించినట్లు సమాచారం. కాగా గురువారంతో రామచంద్ర పిళ్ళై ఈడీ విచారణ ముగియనున్నది. విచారణ తర్వాత పిళ్లైను సీబీఐ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరచనున్నారు. కవిత ఈడీ విచారణకు ముందు రోజు బుచ్చిబాబును 8 గంటలపాటు విచారించడంతో గురువారం నాడు కవితను ఏమేం అడగబోతున్నారనే దానిపై బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది.