TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంపై మంత్రి KTR తొలిసారి స్పందించారు.
రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా.. ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.
TSPSC పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఙాని అని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రభుత్వ శాఖ కాదని.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. దీనిపై బండి సంజయ్ు కనీస అవగాహన లేదని విమర్శించారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. గుజరాత్లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు.
అంతకుముందు ఈ వ్యవహారానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ డబ్బు పిచ్చి కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతో పాటు కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖాన పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన బండి సంజయ్.. విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడుకోవడానికి మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లిందని విమర్శించారు.
కేటీఆర్‌ను భర్తరఫ్ చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీక్ లో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలిచేశారని ఆరోపించారు. పేపర్ లీక్‌పై ఆందోళన చేసిన విద్యార్థులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి కేసీఆర్ కు చుక్కలు చూపెడ్తామని హెచ్చరించారు బండి సంజయ్. అంతకుముందు పేపర్ లీక్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ మార్చి 17న ఉదయం గన్ పార్క్ దగ్గర దీక్ష దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.