పేపర్ లీక్ – స్వప్నలోక్ ఘటనలు… KCR సర్కారుకు చుక్కలు…!!
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల టిఎస్పిఎస్సి పేపర్ లీక్ ఘటన రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా స్వప్నలోక్ అగ్ని ప్రమాదం ఘటన కేసీఆర్ సర్కారుకు చుక్కలు చూపిస్తుంది.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన కేసిఆర్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి.కేసులో కీలక నిందితుడు,టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు పెన్‌డ్రైవ్‌లలో 60 జీబీకి పైగా సమాచారమున్నట్లు వెల్లడైంది.
ఇక పేపర్ లీకేజ్ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి.బిజేపి, కాంగ్రెస్, బిఎస్పి, వైఎస్సార్టీపీ పార్టీలు రోడ్లు ఎక్కాయి.పేపర్ లీకేజీ కేసును సీబీఐకు అప్పగించాలన్న డిమాండ్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్షకు దిగారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం ఇంటికి తరలించారు.అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటు షర్మిలని హౌస్ అరెస్ట్ చేశారు.
అటు స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ప్రతిపక్షాల నుంచి కేసిఆర్ సర్కారుకు నిరసన సెగలు తగులుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పురాతన భవనం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే జిహెచ్ఎంసి పరిధిలో పాతబడిన భవనాల్లో ఎన్నో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్నాయి.ఇటీవల కాలంలో సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో నాలుగు పెద్ద అగ్నిప్రమాదాలు జరిగాయి.ఈ నాలుగు ప్రమాదాల్లో మొత్తం 28 మంది చనిపోయారు.