తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తి సాయికిరణ్ గౌడ్ ఇతనే

హైదరాబాద్ :

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దుండుగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్న(చింతపడు నవీన్)కు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై ఆదివారం మధ్యాహ్నం దాదాపు 20 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

ఆదివారం కావడంతో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలో లేరు. దాడి అనంతరం కార్యాలయ సిబ్బంది, మల్లన్న అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా, దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న.

మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీం ఆరోపించింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని ఆయన చెప్పారు.

పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. నాలుగుసార్లు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినా.. వార్తలు ఆగలేదన్నారు. ఆఫీసు ఖాళీ చేయించాలని తమ ఆపీసు యజమానిని పోలీసులు బెదిరిస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

ఈరోజు Q న్యూస్ ఆఫీసులో దుండగులు దాడి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్నించే వాళ్ళు లేకపోతే రేపు ప్రజల మీద కూడా దాడులు చేస్తారు..