వ్యాపారం జరగక.. పెట్టుబడి పెట్టిన వారికి మొహం చూపించలేక, ఇవ్వాల్సిన వారు బకాయిలు తిరిగివ్వక.. ఒత్తిడితో ఓ ఇసుక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా :
అతను అప్పు చేయలేదు. కానీ, పెట్టుబడి పెట్టిన వారికి సమాధానం చెప్పలేకపోయాడు. ఇసుక వ్యాపారంలో నష్టాలు ముంచేయడంతో.. ఏం చేయాలో దిక్కుతోచక.. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ముఖం చూపించలేక.. సంపాదించే మార్గం, అప్పుల నుంచి బయటపడే దారి దొరకక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్లేపల్లి ప్రేమ్ రాజ్ (40) తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వ్యక్తి. అతను జేపీ పవర్ వెంచర్ సంస్థ ఉపగత్తేదారు టర్న్ కి దగ్గర జిల్లా ఇన్చార్జిగా పనిచేశాడు. ఆదివారం నాడు అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం ఉదయం 8:30 సమయంలో 2 వీలర్ మీద కొవ్వూరు స్టేషన్కు వెళ్లి, అక్కడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలిసిన వెంటనే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎస్ఐ జి శ్రీహరి, కొవ్వూరు సిఐ రవికుమార్ లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అతనిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రేమ్ రాజుకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే, ప్రేమ్ మృతి విషయంలో కొవ్వూరు పోలీసులు అత్యుత్సాహం చూపించాలని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రేమ్ రాజ్ ఆత్మహత్య సంగతి తెలిసిన తాడేపల్లిగూడెం ఎస్ఐ శ్రీహరి, కొవ్వూరు సిఐ రవికుమార్, ఎస్ఐ భూషణంలు అక్కడికి చేరుకున్న తరువాత.. వీరు మృతదేహం వద్దకు ఎవరిని రానీయకుండా అడ్డుకున్నారు.
రైల్వేస్టేషన్లో, పట్టాల మీద ఎవరైనా చనిపోతే తమ పరిధి కాదని చెప్పే పోలీసులు ఈ కేసులో ఎందుకు ఇంత జాగ్రత్త చూపిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు ప్రేమ్ రాజుకు సంబంధించిన వివరాలు ఇలా తెలుస్తున్నాయి.. ప్రేమ్ రాజ్ బీటెక్ వరకు చదువుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. ప్రభుత్వంలోని పెద్దలతో అతనికి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే జేపీ పవర్ వెంచర్స్ ప్రైవేట్ సంస్థలో పశ్చిమగోదావరి ఇన్చార్జిగా చేరాడు. అయితే, ఇసుక వ్యాపారంలో ఉప గుత్తేదారు సంస్థను కొంతకాలం కిందట తప్పించారు. దీంతో రూ. 25 కోట్లు డిపాజిట్ కట్టి ఆ ఇసుక వ్యాపారాన్ని ప్రేమ్ రాజే తీసుకున్నాడు.
ఈ క్రమంలో ప్రతినెల రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అంతగా వ్యాపారం జరగడం లేదు. మూడు నెలలుగా ఈ సొమ్మును చెల్లించలేక బకాయిలు పడ్డాడు. దీంతో ఆ బాధ్యతలలో నుండి ప్రేమ్ రాజును తప్పించి వేరేవారికి అప్పగించారని సమాచారం. కాగా ప్రేమ్ రాజును నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారు.. స్నేహితులకు అతను సమాధానం చెప్పుకోలేకపోయాడు. దీంతో తనకు పరిచయం ఉన్న పెద్దలను కలిసి ఇసుక బాధ్యతలు మళ్లీ తనకే ఇవ్వాలని బతిమాలుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రేమ్ రాజు స్నేహితుడు సాగిరాజు గౌతమ్. బీటెక్ చదువుతున్న సమయంలో విశాఖకు చెందిన అతనితో పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. రెండు రోజుల క్రితం గౌతమ్ ను కొవ్వూరుకు రావాలని ప్రేమ్ రాజ్ కోరాడు. ఈ మేరకు గౌతం కొవ్వూరుకు వచ్చాడు. శనివారం సాయంత్రం ఇద్దరూ కలిసి అదే స్టేషన్లోని బల్లపై కూర్చుని నాలుగు గంటల వరకు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రాత్రి ఇద్దరూ ఒకే చోట పడుకున్నారు. ఉదయం 9 గంటలకు గౌతమ్ లేచేసరికి ప్రేమ్ రాజు కనిపించలేదు. వాకింగ్ కు వెళుతున్నానని అతను పెట్టిన మెసేజ్ కనిపించింది.
స్టేషన్ వద్దకు వచ్చి చూడగా ప్రేమ్ రాజు బండి కనిపించింది. కానీ, అతను కనిపించలేదు. చివరికి అతని ఆత్మహత్య విషయం తెలిసి గౌతమ్ కన్నీరు మున్నీరయ్యాడు. కొద్ది రోజులుగా ప్రేమ్ రాజ్ ఇబ్బందుల్లో ఉన్నాడు. నాకు ఫోన్ చేసి మూడు రోజుల కిందట రమ్మన్నాడు. కొవ్వూరు రైల్వే స్టేషన్ కి నిన్న మధ్యాహ్నం నన్ను తీసుకువెళ్లి ఇసుక వ్యాపారంలో తనను మోసం చేశారని.. కోట్లు రావాలని చెప్పాడు. డబ్బులు ఎవరెవరు ఇవ్వాలో వాళ్ల పేర్లు చెప్పి రాసుకోమన్నాడు. దాదాపు 16 కోట్లు రావాల్సి ఉంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో ఉన్న వారు ఎవరనేది తేలాలని గౌతం అన్నాడు..
ప్రేమ్ రాజు మృతి పట్ల అతని తండ్రి వెంకట రామరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల గురించి తనతో ఎప్పుడూ చెప్పలేదని అన్నాడు. ప్రేమ్ రాజు దగ్గర స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ను తండ్రికి చూపించి.. దాని పిన్ మీకు తెలుసా అని పోలీసులు అడిగారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరా తీయగా… తనకు కారణాలు ఏమీ తెలియని, వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఏవి తనతో చర్చించేవాడు కాదని అతని తండ్రి చెప్పుకొచ్చారు. ఆ ఫోన్లో ఏ వివరాలు ఉన్నాయో తమకు తెలియదని చెప్పాడు. ప్రేమ్ రాజ్ తల్లి కొద్ది రోజుల క్రితం మరణించారు. అతనికి ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. వారిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.