ప్రముఖుల పేర్లు చెప్పి, సిమెంటు–స్టీలు వ్యాపారం పేరుతో ఎర వేసి, స్వల్ప మొత్తంలో లాభాలు చూపి రూ.2.75 కోట్లు కాజేసిన వ్యక్తులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు కేసు నమోదు చేశారు. సూత్రధారికి సహకరించిన మరో ఇద్దరినీ ఇందులో నిందితులుగా చేర్చారు. ముషీరాబాద్ పరిధిలోని జమిస్థాన్‌పూర్‌కు చెందిన దాసరి కెన్నెత్ రోడ్రిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడికి తన స్నేహితుడి ద్వారా అజ్మీరా రాజుతో పరిచయం ఏర్పడింది. తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు సన్నిహితుడినని, వారితో కలిసి పలు వ్యాపారాలు కూడా చేస్తున్నానని అజ్మీరా రాజు నమ్మబలికాడు.
2021 ఫిబ్రవరి 28న కెన్నెత్ రోడ్రిక్ను ఓ స్టార్ హోటల్‌కు పిలిచిన అజ్మీరా రాజు అక్కడ టీ పార్టీ ఇచ్చాడు. ఆ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం మానుకుని, తాను చెప్పినట్లు సిమెంట్, స్టీల్ రంగాల్లో పెట్టాలని కెన్నెత్‌ను కోరాడు. అతడి మాటలు నమ్మిన కెన్నెత్ తొలుత రూ.5 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అదే ఏడాది మార్చి 9న ఈ మొత్తం ఇన్వెస్ట్ చేయగా రూ.20 వేలు లాభం వచ్చిందంటూ కెన్నెత్ బ్యాంకు ఖాతాలోకి అజ్మీరా రాజు జమ చేశాడు. దీంతో అతడిపై పూర్తి నమ్మకం కలిగిన కెన్నెత్ భారీ మొత్తాలు పెట్టుబడులుగా పెట్టడం మొదలెట్టాడు.
వివిధ సందర్భాల్లో రూ.35 లక్షలు నగదు రూపంలో ఇచ్చిన ఆయనకు అజ్మీరా రాజు లాభాల పేరుతో రూ.1.4 లక్షలు చెల్లించాడు. ఈ సందర్భంగా మరింత పెద్ద మొత్తం పెట్టుబడిగా పెడితే లాభాలు ఆ స్థాయిలోనే ఉంటాయని ఎర వేశాడు. దీంతో కెన్నెత్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకుని ఓ ఆస్తిని తనఖా పెట్టి, మరోదాన్ని విక్రయించి అతడికి రూ.44 లక్షలు ఇచ్చాడు. కొన్నాళ్లకు మరోసారి కెన్నెత్‌ను కలిసిన అజ్మీరా రాజు మరో రూ.కోటి ఇన్వెస్ట్ చేయాలని కోరాడు. దీంతో కెన్నెత్ తన బంధువులు, స్నేహితుల వద్ద తీసుకున్న మొత్తంలో రూ.10 లక్షలు అజ్మీరా రాజు వ్యక్తిగత అంగరక్షకుడు శ్రీకాంత్‌కు ఇచ్చాడు. మరో రూ.20 లక్షలు అన్వర్ పాషా అనే వ్యక్తి ఖాతాలో జమ చేశాడు.
ఓ సందర్భంలో కెన్నెత్‌ను కలిసిన అజ్మీరా రాజు వ్యాపారం భారీ స్థాయిలో చేయడానికి పెద్ద చిట్స్ వేద్దామని సూచించాడు. దీంతో రూ.కోటి, రూ.50 లక్షలు చిట్టీలు వేసిన కెన్నెత్ దాదాపు 13 నెలల పాటు చెల్లించారు. ఆ చిట్స్ ఎత్తడం ద్వారా వచ్చిన మొత్తాన్ని తనకు అప్పగిస్తే పెట్టుబడిపెడదామంటూ అజ్మీరా రాజు కోరాడు. అయితే ఆ సమయంలో చిట్ ఎత్తేస్తే నష్టం వస్తుందని తెలుసుకున్న కెన్నెత్ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మరో సందర్భంలో తన పలుకుబడిని వినియోగించి ప్రభుత్వ విభాగాలు, సెక్రటేరియేట్‌లో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పిన అజ్మీరా రాజు అందుకు రూ.24 లక్షల వరకు ఖర్చువుతుందని, ఆ మొత్తం ఇవ్వాలని కోరాడు.
అతడి మాటలు నమ్మిన కెన్నెత్ తన పరిచయస్తుల ద్వారా ఆ మొత్తాన్ని సేకరించి ఇచ్చాడు. ఓ దశలో ప్రముఖుడిని కలుద్దామంటూ దుబాయ్ వరకు తీసుకెళ్లినా.. అంతలోనే సదరు వ్యక్తి హైదరాబాద్ వచ్చేశారంటూ వెనక్కు తీసుకు వచ్చేశాడు. ఇలా వివిధ రకాల పేర్లతో రూ.2.75 కోట్లు కాజేసిన అజ్మీరా రాజుతో పాటు అతడికి సహకరించిన శ్రీకాంత్, అన్వర్ పాషాలపై కెన్నెత్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన అధికారులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.