దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్‌ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు ఇతర హామీలను తక్షణం నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరో మహోద్యమానికి దిగుతామని కేంద్రానికి అల్టిమేటం జారీచేశారు.

హామీలను నెరవేర్చకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతాం కేంద్రానికి రైతుల హెచ్చరిక.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్‌ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు ఇతర హామీలను తక్షణం నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరో మహోద్యమానికి దిగుతామని కేంద్రానికి అల్టిమేటం జారీచేశారు. ఏప్రిల్‌ 30న ఢిల్లీలో రైతు సంఘాలు సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటామని రాంలీలా మైదానంలో జరిగిన కిసాన్‌ మహాపంచాయత్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

న్యూఢిల్లీ, మార్చి 20:ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ విజయవంతమైంది. దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. పార్లమెంట్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును రైతులు, రైతు సంఘాల నేతలు కడిగిపారేశారు. మోదీ సర్కార్‌ వైఖరిని తీవ్రంగా నిరసించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమ విరమణ సమయంలో కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మరోసారి దేశవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఎస్కేఎం నేతృత్వంలో జరిగిన ఈ మహాపంచాయత్‌లో మహిళా రైతులు కూడా భారీగా పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే..

మహాపంచాయత్‌లో ఎస్కేఎం నేత దర్శన్‌పాల్‌ మాట్లాడుతూ రైతు సంఘాలు ఏప్రిల్‌ 30న ఢిల్లీలో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు అన్ని రాష్ర్టాల్లో రైతులు ర్యాలీలు, మహాపంచాయత్‌లు నిర్వహించాలని కోరారు. ‘ప్రతి రోజూ ఆందోళనలు చేయాలని మేమేమీ అనుకోవడం లేదు. ప్రభుత్వ తీరు కారణంగా ఆ దిశగా వెళ్లాల్సి వస్తున్నది’ అని స్పష్టం చేశారు. రైతు డిమాండ్లను సర్కార్‌ పరిష్కరించకుంటే, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళన కంటే పెద్ద ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. జైకిసాన్‌ ఆందోళన్‌ జాతీయ అధ్యక్షుడు అవిక్‌ సాహా మాట్లాడుతూ ఉద్యమ సమయంలో రైతులపై నమోదు చేసిన వేలాది కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యమంలో అమరులైన 750 రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించకుండా అమానవీయంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతన్నకే ఆహారం దొరకని దుస్థితి…

కిసాన్‌ పంచాయత్‌లో బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన మాజిందర్‌ షా అనే రైతు మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. దేశవ్యాప్తంగా రైతులు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మారిపోతున్నాడని, అయితే దేశానికి అన్నం పెట్టే రైతన్నకే కడుపుకి ఇంత ఆహారం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కేవలం ఐదు శాతం మంది వద్దనే మెజార్టీ దేశ సంపద పోగుపడిపోయిందని, మరోవైపు పిల్లల పెండ్లి చేసేందుకు రైతుకు మరో దిక్కు లేక తన భూమిని తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వెళ్లగక్కాడు.

ఎంఎస్పీపై కమిటీ అంటూ మోసం…

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే సమయంలో దేశవ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర అందేలా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు కమిటీ వేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ గత ఏడాది జూలైలో ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఈ కమిటీని సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత అంశం ప్రస్తావన లేని ఈ కమిటీ అజెండాకు విలువ లేదని స్పష్టం చేసింది.

మీరు ఆందోళన నడపండి… తోమర్‌

కిసాన్‌ పంచాయత్‌ నేపథ్యంలో 15 మందితో కూడిన రైతు నేతల బృందం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని కృషిభవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను రైతు నేతలు మంత్రికి అందించారు. ఎంఎస్పీకి చట్టబద్ధత విషయంలో కేంద్ర మంత్రి తోమర్‌ ఎటువంటి హామీ ఇవ్వలేదని రైతు నేతల బృందం పేర్కొన్నది. ‘మేం ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మీరు ఆందోళన నడిపించండి’ అంటూ తోమర్‌ అన్నారని నేతలు సమావేశం తర్వాత పేర్కొన్నారు. ఆందోళనలు లేకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఇవ్వబోమనే అంశం భేటీ ద్వారా కేంద్రం స్పష్టంచేసిందని రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు.