48 మీటర్ల వెడల్పు.. రెండు మీటర్ల లోతు కాలువ.. అలలతో కూడిన 2వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం.. మధ్యలో అవరోధాలు.. రెండు గంటలపాటు ఆపకుండా ఈత.. గట్టుపై పోలీసుల పరుగు.. అయినా అతడు ఆగకుండా మూడు కి.మీ. ఈదాడు.
సంగం, పొదలకూరు :
48 మీటర్ల వెడల్పు.. రెండు మీటర్ల లోతు కాలువ.. అలలతో కూడిన 2వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం.. మధ్యలో అవరోధాలు.. రెండు గంటలపాటు ఆపకుండా ఈత.. గట్టుపై పోలీసుల పరుగు.. అయినా అతడు ఆగకుండా మూడు కి.మీ. ఈదాడు. పోలీసులనుంచి తప్పించుకోవడానికి ఓ టిప్పర్ డ్రైవర్ చేసిన సాహసమిది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటాచలం మండలం ఇడిమేపల్లికి చెందిన చల్లా కృష్ణ వింజమూరుకు టిప్పర్ తీసుకెళుతున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టి ఆగకుండా సంగం వైపు వేగంగా వస్తూ గేదెనూ ఢీకొన్నారు. వాహనాన్ని ఆపాలని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంబడించి టిప్పర్ బెజవాడ పాపిరెడ్డి కాలువ వైపు వెళుతూ అదుపుతప్పి కనిగిరి జలాశయం ప్రధాన కాలువ గట్టుపై ఆగడాన్ని గమనించారు. డ్రైవర్ కనిగిరి జలాశయం కాలువలో దూకి ఈదుతూ వెళుతున్నట్లు గుర్తించారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలో ఈదడం ప్రమాదమంటూ ఎస్సై కె. నాగార్జునరెడ్డి అక్కడికి వెళ్లి గట్టుపై పరుగెడుతూ కృష్ణను హెచ్చరించారు. దీంతో మరింత భయపడిన అతడు వేగంగా ఈదసాగాడు. కాలువలో ఒక చోట చెట్లను పట్టుకుని కాసేపు సేదదీరాడు. అక్కడే బెండు ముక్క దొరకడంతో దాని ఊతంగా తిరిగి ఈత మొదలుపెట్టాడు. లాభం లేదని సంగంలోని గజ ఈతగాడు వెంకటేశ్వర్లును పోలీసులు రంగంలోకి దించారు. పోలీసులు కొట్టకుండా చూస్తానని చెప్పి కృష్ణను వెంకటేశ్వర్లు గట్టుకు తెచ్చారు.