ఉగాది వేళ పేలిన పొలిటికల్ సెటైర్లు…
కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లు ఒక్కసారి చూస్తే…!
ఉగాది.. (Ugadi) ఇది తెలుగు వారికి సంవత్సరంలో వచ్చే తొలి పండగ. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ ఉగాది పర్వదినాన జీవిత సారాన్ని తెలిపే ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. దేశ వ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు అయితే తమ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు సోషల్ మీడియా (Social Media) వేదికగా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు (Ugadi Wishes) తెలుపుతున్నారు. అయితే.. తెలంగాణలో (Telangana) మాత్రం ఈ పర్వదినాన కూడా తెలంగాణ పొలిటికల్ సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ట్విట్టర్ వేదికగా పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ రాజకీయ నేతలు కాస్త డిఫరెంట్‌గా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) బీజేపీ (BJP) గురించి.. ఆదాయం, వ్యవయం , అవమానం, రాజపూజ్యం ఇలా అన్ని విషయాలను ప్రస్తావించి వినూత్నంగా ట్వీట్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు (BRS Cadre) పెద్ద ఎత్తున షేర్ చేసుకుని కామెంట్స్ చేస్తుండగా.. బీజేపీ నేతలు, కార్యకర్తలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (TS BJP Chief Bandi Sanjay) కూడా అంతే రీతిలో కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family) పేరేత్తి కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ వీరిద్దరూ చేసిన ట్వీట్ కథేంటో చూద్దాం రండి.
కేటీఆర్ ట్వీట్ సారాంశం ఇదీ..
‘ఆదాయం : అదానీకి!
వ్యయం : జనానికి, బ్యాంకులకు!
అవమానం : నెహ్రూకి!
రాజపూజ్యం : గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌ను కొందరు పంపగా ట్వీట్ చేస్తున్నట్లు కూడా కేటీఆర్ రాసుకొచ్చారు.
బండి సంజయ్ ట్వీట్ ఇదీ..!
‘ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి
అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!
తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే..’ అని కేటీఆర్‌కు అంతే రీతిలో బండి సంజయ్ ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
ఈ ట్వీట్లకు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఇటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇక కామెంట్స్‌కు అయితే కొదువే లేదు. ‘ఆదాయం : రకుల్ రావు, లిక్కర్ రాణికి .. వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి.. అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు.. రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!.. పౌడర్ బుక్కుడు పిట్టల దొర, తుపాకి ముచ్చట్లు గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే’ అని కేటీఆర్ ట్వీట్‌కు బీజేపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మోదీ ప్రధాని పీఠం ఎక్కిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేసిందేంటి..? అని గ్రాఫ్స్తో సహా లెక్కలు తీస్తున్నారు. ఇలా ఈ ఇద్దరి ట్వీట్స్.. కార్యకర్తల కామెంట్స్‌తో ట్విట్టర్ మోతెక్కిపోయింది.