కంటి వెలుగు అద్భుతం… కేజ్రీవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత పరీక్షలు అసాధారణం… కేజ్రీవాల్
ఢిల్లీ , పంజాబ్‌లోనూ అమలు చేస్తాం మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజనరీ ప్రాజెక్టులతో వ్యవసాయ రంగంలో అనూహ్య పురోగతి సాధించారు
తెలంగాణపై ఢిల్లీ సీఎం ప్రశంసలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని చెప్పారు. దృష్టిలోపాలు ఉన్నవారికి ఉచితంగా అద్దాలు అందజేస్తున్నారని, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారని అభినందించారు.
బుధవారం ఢిల్లీలో మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. మంచిని స్వీకరించాలని, గొప్ప కార్యక్రమాలు ఎకడ అమలుచేసినా చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అంతేగానీ స్వార్థ రాజకీయాలు చేయవద్దని హితవుపలికారు. తెలంగాణలో అమలవుతున్న గొప్ప కార్యక్రమాలను తాము ఢిల్లీతోపాటు పంజాబ్‌లో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. అనవసర రాజకీయాలు మాని మంచి పనులను చూసి నేర్చుకోవాలని అన్నారు.
ఈ ఏడాది జనవరి 18న కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్ కలిసి ప్రా రంభించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కంటివెలుగు అమలుతీరును సీ ఎం కేసీఆర్ వారికి వివరించారు. కార్యక్రమం గురించి తెలుసుకొని కేజ్రీవాల్ ముగ్ధులయ్యారు. బుధవారం ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో మరోసారి మెచ్చుకున్నారు.
సాగులో విప్లవాత్మక ప్రగతి…
తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా నిర్మించారని కేజ్రీవాల్ ప్రశంసించారు. నీటిపారుదల పథకాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించారని చె ప్పారు. ఇటీవలే పంజాబ్ ముఖ్యమం త్రి భగవంత్ మాన్ తెలంగాణలో పర్యటించారని, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించారని గుర్తు చేశారు. గత నె లలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలంగాణలో పర్యటించారు. కాళేశ్వ రం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించా రు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సారథ్యంలో మూడేండ్లలోనే ఎలా నిర్మించారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తెలంగాణ నీటిపారుదల విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
తెలంగాణ నీటిపారుదల విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సారథ్యంలో కేవలం మూడేండ్లలోనే నిర్మించారంటే ఆశ్చర్యం కలుగుతున్నది. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. అలాంటి అద్భుతాల్లో కంటి వెలుగు ఒకటి. ఢిల్లీ, పంజాబ్‌లలోనూ ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తాం……. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్