మరో ఐదుగురికి కేజీహెచ్‌లో చికిత్స… వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమం.
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలవగా.. మరో ఐదుగురు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని 29వ వార్డు పరిధి రామజోగిపేటలో 40 ఏళ్ల కిందట నిరి్మంచిన భవనం 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి బుధవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది.
ఘటనలో భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న బిహార్‌కు చెందిన రామ్‌విలాస్ (30) (అలియాస్ ఛోటు), మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సాకేటి దుర్గాప్రసాద్ (17), సాకేటి అంజలి (14) మృతి చెందారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ (29), మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సాకేటి రామారావు (39), సాకేటి కల్యాణి, రెండో ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న సన్నాపు కృష్ణ (30), పి.రోజారాణి గాయాలతో బయటపడ్డారు.
5 గంటల పాటు రాష్ట్ర విపత్తులు, ఫైర్ సర్వీస్ విభాగం, పోలీసులు శ్రమించి శిథిలాలోంచి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కల్యాణి పరిస్థితి విషమంగా ఉంది. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఘటన ప్రాంతానికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.