పరీక్షలు బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్ధిని కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో ఆత్మహత్యకు పాల్పడింది. పండగపూట నీళ్లలో శవమై తేలిన కూతురు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి..
పరీక్షలు బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్ధిని కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో ఆత్మహత్యకు పాల్పడింది. పండగపూట నీళ్లలో శవమై తేలిన కూతురు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, బంధువుల కథనం ప్రకారం..
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాల్ల రామయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు నాగలక్ష్మి మల్యాల మండలం నూకపెల్లి మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. సోమవారం బోటనీ పరీక్ష రాసిన నాగలక్ష్మి తాను పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైంది. ఇదే విషయాన్ని తన స్నేహితులతో కూడా తెల్పింది. పరీక్షరాసి ఇంటికి వచ్చినప్పటి నుంచి నాగలక్ష్మి ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. తాను పరీక్ష బాగా రాయలేకపోయానని రోదిస్తూ తెల్పగా, తల్లిదండ్రులు బాలికకు ధైర్యం చెప్పారు.
ఈక్రమంలో బుధవారం ఉగాది పండగకావడంతో ఇంటి ఎదుట ముగ్గులు వేసింది. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లిన నాగలక్ష్మి మధ్యాహ్నమైనా తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులకు సమాచారం అందించారు. గోదావరినది వైపు నాగలక్ష్మి వెళ్లిందని స్థానికులు చెప్పడంతో తల్లిదండ్రులు అటుగా వెళ్లారు. గోదావరి ఒడ్డున నాగలక్ష్మి చెప్పులు కనిపించడంతో బాలిక నదిలో దూకి ఉంటుందనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్లసాయంతో గాలించగా నాగలక్ష్మి మృతదేహం లభ్యమైంది. కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజు మీడియాకు తెలిపారు.