ఒకప్పుడు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాలంటే జనాలు ఆర్టీసీ బస్సు లేదా ఆటోలోనే ఎక్కవగా వెళ్లేవారు. ఇప్పుడు ఒలా, ఊబర్, రాపిడో లాంటి రైడింగ్స్ వచ్చాక చాలా మంది వీటినే ఎక్కవగా వినియోగిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో తాజాగా బైక్ ను బుక్ చేసుకున్న మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది.
వివరాల్లోకి వెళ్తే….
మణికొండలోని ఓ కంపెనీలో కంటెంట్ క్రియేటర్ గా పనిచేస్తున్న ఓ మహిళ రైడ్ అగ్రిగేటర్ అనే యాప్ లో సోమవారం తన రైడ్ బుక్ చేసుకుంది. మణికొండ నుంచి బంజారాహిల్స్ లోని తన నివాసానికి ఈ రైడ్ బుక్ చేసుకంది. అంతలోనే బైక్ రైడర్ రావడంతో దానిపై ఆమె కూర్చుంది. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఆ మహిళ పట్ల రైడర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీర భాగాలను తాకుతూ పైశాచికాన్ని చూపించాడు.
జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ మార్గంలో వెళ్తుడంగా నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆమె ఆ బైక్ రైడర్ చేష్టలను తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అతను ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఆ రైడర్ పై ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణలతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు ఆ నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.