హీరా గోల్డ్‌ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్‌

హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్కు భారీ షాక్‌ తగిలింది. హీరా గోల్డ్‌లో రూ.5వేల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై నౌహీరా షేక్‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.33 కోట్లు విలువ చేసే నౌహీరా షేక్‌కు చెందిన 24 ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈదీ ఇప్పటి వరకు రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ హీరా ఆస్తుల్ని జప్తు చేస్తుండగా.. 36 శాతం అధిక వడ్డీ ఆశచూపి అమాయకుల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించింది. తిరిగి వాటిని చెల్లించడంలో విఫలం కావడంతో దేశ వ్యాప్తంగా డిపాజిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

పలు స్టేషన్‌లలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేపట్టారు. హీరా గోల్డ్ కుంభకోణం వల్ల దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. మనీలాండరింగ్‌ కేసులో 2018 అక్టోబర్ 16వ తేదీన నౌహీరా షేక్‌ను అరెస్టు చేశారు