రాహుల్ గాంధీ MP అనర్హత వేటు సబబేనా…? భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏం చెబుతుంది…?
నిపుణులు, న్యాయకోవిదులు ఏమంటున్నారు?
లోక్‌సభ సచివాలయం ఈ విషయంలో తొందరపడిందా? లేక రూల్‌బుక్‌ను అనుసరించే ఈ నిర్ణయం తీసుకుందా? ఇంతటి సంచలన నిర్ణయం తీసుకునే ముందు సుప్రీంకోర్టు గత తీర్పులను, ప్రాథమిక నిబంధనలను పట్టించుకోలేదా? ఇప్పుడీ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి.రాజ్యాంగం ఏం చెబుతోంది?భారత రాజ్యాంగం పార్లమెంట్‌లోని ఉభయ సభల అనర్హతపై ఆర్టికల్స్ 101, 102, 103, 191(1)(శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు)లలో స్పష్టతనిచ్చింది. ఈ అధికరణలు పదో షెడ్యూల్‌లో ఉన్నాయి.
వాటి వివరాలు..
ఆర్టికల్ 102(1)(ఏ): ఒక సభ్యుడు/సభ్యురాలు లాభదాయక పదవుల్లో కొనసాగితే.. అనర్హత వేటు వేయవచ్చు.
102(1)(బీ): సభ్యుడి మానసిక స్థితి సరిగ్గా లేదని కోర్టులు ధ్రువీకరిస్తే.. అనర్హత.
102(1)(సీ): దివాళా తీసినప్పుడు.
102(1)(డీ): భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు.
102(1)(ఈ): పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టం ప్రకారం అనర్హత పరిధిలోకి వస్తే.. (వరకట్నం, సతీ, అస్పృశ్యత వంటి దురాచారాల నిరోధక చట్టాలతోపాటు.. అవినీతి, ఇతర చట్టాల పరిధిలో జైలు శిక్ష పడితే అనర్హత
ఇంకా ఈ అధికరణలో.. పార్టీ ఫిరాయింపుల (పార్టీ ఫిరాయింపుల చట్టం-1985, పార్టీ ఫిరాయింపుల సవరణ చట్టం-2003), పార్టీ విప్‌ను ధిక్కరించినప్పుడు, పార్టీకి రాజీనామా చేసినా, స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికై.. ఏదైనా పార్టీలో చేరినా, నామినేటెడ్ సభ్యుడు తన పదవి పూర్తయిన ఆర్నెల్లలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరినా.. అనర్హత వేటు ఉంటుంది. దీంతోపాటు.. దీర్ఘకాలంగా సభకు హాజరుకాని సభ్యులపైనా అనర్హత వేటు పడుతుంది.
ప్రజా ప్రతినిధ్య చట్టం ఏం చెబుతోంది?
మనకు రెండు ప్రజాప్రాతినిధ్య చట్టాలు – ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ఉన్నాయి. మొదటి చట్టం ఓటర్ల జాబితా, నియోజకవర్గాల కూర్పు వంటి అంశాలను ప్రస్తావిస్తుండగా.. రెండో చట్టం ఎన్నికల్లో నేరాలకు సంబంధించినది. ఇప్పుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు సంబంధించి ఆర్టికల్ 102(1)(ఈ)తోపాటు.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(3)ని ప్రస్తావించారు. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడే సభ్యులపై ఆరేళ్ల దాకా అనర్హత వేటు వేయవచ్చని ఈ సెక్షన్ స్పష్టం చేస్తోంది.
అనర్హత వేసేదెవరు?
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యులపై అనర్హత వేసే అధికారం సభాపతికి ఉంటుంది. సభాధ్యక్షులదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఏ కోర్టుల్లోనూ సవాలు చేయకూడదు. కానీ, 1993లో కిహోలో హోలాహాన్ వర్సెస్ జాచిల్హు కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. సభాధ్యక్షులదే తుది నిర్ణయం కాదని, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని, సుప్రీంకోర్టు నిర్ణయమే తుది నిర్ణయమని తేల్చిచెప్పింది. కానీ, రాజ్యాంగంలోని ఇతర ఆర్టికల్స్ ప్రకారం.. సభ్యులపై సభాధ్యక్షుడు అనర్హత వేటు వేయవచ్చు. కానీ, దీనిపై తుది నిర్ణయం రాష్ట్రపతిదే. రాష్ట్రపతి నిర్ణయంపై కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు.
కోర్టు తీర్పులు..
జయాబచ్చన్ vs యూనియన్ ఆఫ్ ఇండియా(2006): గౌరవ వేతనం కూడా లాభదాయక పదవి కిందకు వస్తుందని, వేతనం తీసుకోకపోయినా.. ఆ పదవిలో ఉండే అధికారం, హోదా, గుర్తింపు కూడా లాభదాయకంగానే పరిగణించాలని, అలాంటి సందర్భాల్లో సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
లిల్లీ థామస్ vs స్టేట్ ఆఫ్ కర్ణాటక(2014): రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన సభ్యులు వెంటనే అనర్హతకు గురవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీపై వెంటనే అనర్హత పడడానికి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దోహదపడింది.
లోక్ ప్రహరీ vs భారత ఎన్నికల సంఘం(2018): అనర్హత వేటు పడ్డ సభ్యుడిపై అభియోగాలను పైకోర్టు కొట్టివేస్తే.. అతని సభ్యత్వం పునరుద్ధరణ అవుతుంది.
సుప్రీం తీర్పు , ఆర్టికల్ 102(1)(ఈ) ప్రకారమే…
రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(3)ని లోక్‌సభ సచివాలయం ప్రస్తావించింది. లిల్లీ థామస్ కేసులోనూ సుప్రీంకోర్టు వెంటనే అనర్హత వేయవచ్చని స్పష్టం చేసింది.
ఈ ప్రకారం.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం సబబే..! కానీ, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 8(4) ప్రకారం.. శిక్ష పడ్డ మూడు నెలల తర్వాత మాత్రమే అనర్హత ప్రక్రియ ప్రారంభం కావాలి. ఆ సమయంలో శిక్షపడ్డ సభ్యుడు అప్పీల్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కిందికోర్టుల తీర్పులను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. కానీ, రాహుల్ గాంధీ విషయంలో అలా జరగలేదు. వెంటనే అనర్హత వేటు వేశారు.
ఆర్టికల్ 102(1)(ఈ) ప్రకారం.. వయనాడ్ పార్లమెంట్ స్థానం ఖాళీ అయినట్లే. కానీ, లోక్ ప్రహరి కేసులో కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం.. రాహుల్ గాంధీపై అభియోగాలను పైకోర్టు కొట్టివేస్తే.. అతని సభ్యత్వం పునరుద్ధరణ అవ్వాలి. ఇప్పటికి లోక్‌సభ సచివాలయం అనర్హతపై నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్రపతి నిర్ణయమే ఫైనల్. రాష్ట్రపతి వెంటనే ఆమోదించడానికి వీల్లేదు. ఆయన భారత ఎన్నికల సంఘం సలహాలను తీసుకుంటారు.
తొందరపాటు నిర్ణయమేనా?
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పెరిగేనా?
లోక్‌సభ సచివాలయం చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం లిల్లీ థామస్ తీర్పు ఆధారంగా వెంటనే అనర్హత వేటు వేసింది. గతంలో అనర్హతల చరిత్ర ఉన్నా.. ఎక్కడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాతి రోజే తుది నిర్ణయం తీసుకోలేదు. అనర్హత వేటు వేసే ముందు రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేయాల్సింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(4)ను విస్మరించినట్లు స్పష్టమవుతోంది. నిబంధనలు, ప్రమాణాలను పాటించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఇది.