జగిత్యాల జిల్లా…
మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది.
మూఢనమ్మకం నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు… జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు
నిన్న రాత్రి మల్యాల మండలం బల్వoతపుర్ గ్రామంలో మూఢనమ్మకాల నివారణకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..
ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు.సమాజంలో ఎక్కడా చేతబడి, బాణామతి లేదని మానసిక రోగాలకు లోనైన వ్యక్తుల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అనుమానం పెనుభూతం లాంటిదని.. ఇది నమ్మితే ఇబ్బందుల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది. ప్రస్తుత సమాజంలో నమ్మకమనే పేరులోనే మూఢనమ్మకాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల వారికి మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్నవారికి, చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. నమ్మకాన్ని నమ్మచ్చుకాని, మూఢనమ్మకాలను నమ్మకూడదు. అసలు మూఢ నమ్మకాలు నమ్మడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే అది ఎందుకూ పనికిరాదనే విషయం అర్థమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని గుడ్డిగా నమ్మటం, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని ఆ పని చేస్తే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందని నమ్మడం, శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా ఉన్న విషయాలను విశ్లేషించకుండా, ఆలోచించకుండా పిచ్చితనంతో ఫాలో అయిపోవడం మొదలైనవాటిని మూఢనమ్మకాలు అని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటివాటిని నమ్మడంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు దూరమవుతాయన్నారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఇటీవల మంత్రాల నెపంతో వృద్ధురాలిపై దాడి చేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందని తెలిపారు. బాణామతి నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్థులు పనిచేయాలన్నారు. ఈ రోజుల్లో నిరక్షరాస్యుల తోపాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో జిల్లా పోలీస్ కళాబృందం,జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి. సోషల్ మీడియా లో వచ్చే పోస్టుల తో జాగ్రత్త వహించండి.
ఆధునిక సాంకేతిక హంగులున్న స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికి చేతుల్లో ఉంటున్నాయి. ప్రస్తుత కాలంలో సామాన్యులకు సైతం స్మార్ట్ఫోన్లు కనీస అవసరాలయ్యాయి. బ్యాంకు ఖాతాలతో ఫోన్ నంబర్లు అనుసంధానం కావడంతో యాప్ లు డౌన్లోడ్ చేసుకుని చాలామంది నగదు రహిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఓ వైపు డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తుండగా అంతే వేగంగా మరోవైపు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా సొమ్ములు తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఆశ్రయించాలి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదని అట్లాంటి వాటి పై వెంటనే పోలీసువారికి తెలుపాలని సూచించారు,గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగింది పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు, వ్యాపారులకు సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం వారి చే ఏర్పాటుచేసిన మూఢనమ్మకాలపై నివారణపై చేసిన కార్యక్రమాలు మరియు మ్యాజిక్ షో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరులను చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్, డాక్టర్ రవిశంకర్, సి.ఐ రమణమూర్తి, ఎస్.ఐ చిరంజీవి, సర్పంచి రమేష్, ఎంపీటీసీ రవి, పోలీస్ సిబ్బంది , సుమారు 600 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.