మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు… షెడ్యూల్‌ విడుదల చేసిన EC

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు… షెడ్యూల్‌ విడుదల చేసిన EC…

దిల్లీ :

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది..

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది..

వృద్ధులకు ఇంటి నుంచే ఓటు..

రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్‌ హోం (Vote From Home)’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100ఏళ్లు పైబడిన ఓటర్లున్నట్లు తెలిపారు. శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం.