చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం…!

చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం..!

అమాంతం పెరిగిన ధరలు.. రూ.6వేల నుంచి రూ.7వేల వరకు..
నెల రోజుల్లో రూ. 800 నుంచి రూ.వెయ్యి పెరుగుదల..
ఇబ్బందిపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు.

ధరలను అదుపు చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు..

బియ్యం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ఇబ్బందిపడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేక, సన్నబియ్యం కొనలేక ఒక పూట పస్తులుండే పరిస్థితి దాపురించింది.గతంలో క్వింటాలు సన్న బియ్యానికి రూ.4వేల నుంచి రూ.4500 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు సామాన్యులు కొనలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలను అదుపు చేసి, సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చుకలు చూపిస్తున్నాయి. గత నెల రోజులతో పోలిస్తే ప్రస్తుతం బియ్యం ధరలు అమాంతం పెరిగి సామాన్యులు తినలేని దుస్థితి వచ్చింది. క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పెరగడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే పాత, కొత్త బియ్యానికి రెకలు వచ్చాయి. పెరిగిన బియ్యం ధరలతో రైతులు పండించిన ధాన్యానికి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఆహార గింజల కొరతతోపాటు యాసంగిలో వరి కోతల ముందు తుపాన్‌ ప్రభావంతో రైతుల ధాన్యం తడిసిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ర్టాల్లో ధాన్యానికి డిమాండ్‌ ఉండడంతో ఎగుమతులు ఎకువయ్యాయి. దీంతో బియ్యం ధరలకు ఒకసారిగా రెకలొచ్చాయి. ఈ సీజన్లో గ్రేడ్‌ ‘ఏ’ రకానికి రూ.2203, కామన్‌ గ్రేడ్‌ రకానికి రూ.2,183 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నది.

ఇక ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి రూ.3100 నుంచి రూ.3200 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వడ్ల వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి డబ్బులు ఇచ్చి మరి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మూడు నెలల క్రితం వరకు నార్మల్‌గా ఉన్న బియ్యం ధరలు ఒకసారిగా పెరగడంతో పేద ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారింది. ఏకంగా క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పెరగడంతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. విజయమసూరి కొత్త బియ్యానికి క్వింటాలు రూ.4500 నుంచి రూ.4800 వరకు, పాత బియ్యానికి రూ.5800 నుంచి రూ.6200, ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యానికి కొత్త వాటికి రూ.5200 నుంచి రూ.5500 వరకు ఉండగా పాత బియ్యానికి రూ.6,500 నుంచి రూ.6,800 వరకు పెరిగింది. జై శ్రీరామ్‌ కొత్త బియ్యానికి రూ.6000 నుంచి రూ.6200 వరకు, పాత బియ్యానికి రూ.7500 నుంచి రూ.7800 వరకు ప్రస్తుతం ధరలు ఉన్నాయి. దీంతో సన్నబియ్యం కొనాలంటే జనం జంకుతున్నారు.

క్వింటాకు రూ.2వేల వరకు పెరిగింది

గతంలో ఎప్పుడూ లేనివిధంగా బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. గతంలో సన్నబియ్యం క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.4,500వరకు ధర ఉండేది. ఈ ఏడాది రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతున్నది. అంటే సుమారు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద కుటుంబాలైతే సన్నబి య్యం తినే అవకాశం లేకుండా పోతున్నది. ప్రభుత్వం బియ్యం ధరలను అదు పు చేయకపోతే పేదలు మూడు పూటలా అన్నం తినే అవకాశం ఉండదు.