హైదరాబాద్ :
ఓ యువతిని దారుణంగా హతమార్చారు దుండగులు..! మరోచోట డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టారు..! అది కూడా మిట్ట మధ్యాహ్నం. హత్య జరిగి 24 గంటలు దాటుతున్నా.. మిస్టరీ వీడటం లేదు. మొయినాబాద్ పరిధిలో పోలీసులకే సవాల్‌గా మారిందీ ఘటన. హంతకులు తెలివిగా వ్యవహరించడంతో.. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక బృందాలతో పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. మొయినాబాద్ శివారులోని బాకారంలో ఓ యువతి హత్య సంచలనం రేపింది. మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పొలం సమీపంలో ముళ్ళ పొదల మధ్యలో మంటలు రావడం గమనించారు స్థానిక రైతులు. ఎవరో.. చెత్త చెదారం తగలబెడుతున్నారు అనుకున్నారు. కానీ మంటలు మరింత ఎక్కువ అవడంతో అనుమానం వచ్చిన రైతులు దగ్గరి వరకు వెళ్ళి చూసారు. అక్కడ ఒక యువతి శవం తగలబడుతూ ఉండటం గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భయాందోళనకు గురైన రైతులు.. మంటలను ఆర్పే ప్రయత్నం చేయలేదు. పోలీసులు వచ్చే వరకు బాడీ తగలబడుతూనే ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మంటలను ఆర్పారు. అప్పటికే మృతదేహం 90 శాతం కాలిపోయింది.
ఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఆధారాలు బట్టి.. మృతదేహం 30 ఏళ్ల లోపున్న యువతిగా నిర్ధారిస్తున్నారు పోలీసులు. హత్య చేయబడ్డ యువతి ఎవరు..? హంతకులు ఎవరు..? ఎక్కడ చంపారు..? ఇక్కడే ఎందుకు తగలబెట్టారు..? అనే ప్రశ్నలు పోలీసులను చుట్టుముట్టాయి. హత్య జరిగి 24 గంటలు దాటుతున్నా… నిందితుల ఆచూకీ కాదు కదా! కనీసం క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. అంత తెలివిగా వ్యవహరించారు హంతకులు. యువతిని మొయినాబాద్ పరిధిలోని ఎన్కేపల్లి – బాకారం శివార్లలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎక్కడో చంపి తీసుకొచ్చి.. ఇక్కడ తగలబెట్టారు అనేది మాత్రం పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఘటనా స్థలంలో యువతి మొబైల్ ఫోన్ ని కూడా మంటల్లో పారేసి వెళ్ళారు. కానీ.. అందులో సిమ్ కార్డు లేనట్లుగా పోలీసులు గుర్తించారు. అంటే.. ఒకవేళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువతి కోసం గాలించినా దొరకకూడదు అనే మాస్టర్ ప్లాన్‌లో ఉన్నారు హంతకులు. ఒక రూట్లో వచ్చి.. మరో రూట్లో వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పూర్తిగా పంట పొలాలు, నిర్మానుష్య ప్రాంతం కావడంతో.. సీసీ కెమెరాలు కూడా లేవు. ఎన్కేపల్లి- బకారం రూట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో తనిఖీ చేశారు. స్థానికులను ప్రశ్నించారు. మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేశారు. అయినా.. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఘటనా స్థలంలో దొరికిన యువతి ప్యాంట్ వెనక భాగం, సగం కాలిన సెల్ ఫోన్.. సీసీ కెమెరాలు, స్నిఫర్ డాగ్స్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు యువతి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. దీనితో, యువతిది హైదరాబాద్ కాకపోవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని క్రికెట్ గ్రౌండ్స్, రిసార్ట్ లకి ఉన్న కెమెరాలు, దారిలో ఉన్న రిసార్ట్ లు, షాప్స్… ఇలా ప్రతీ సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. పట్ట పగలే.. ఎవరైనా చూస్తారు అనే భయం కూడా లేకుండా… అది కూడా రోడ్డుకు సమీపంలోనే.. ఓ యువతి ని దారుణంగా హత్య చేశారంటే కచ్చితంగా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.