నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో బిగ్‌ ట్విస్ట్… అసలు విషయం బయటపెట్టిన CEO

మహిళా వ్యాపారవేత్త తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి, ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితురాలు సుచనా సేథ్‌ (39) బెంగళూరుకు చెందిన మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌ అనే ఓ స్టార్టప్‌ కంపెనీ సీఈవోగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నాలుగేళ్ల చిన్నారి హత్యకు గల అసలు కారణాన్ని పోలీసుల దర్యాప్తులో..

బెంగళూరు :

మహిళా వ్యాపారవేత్త తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి, ట్యాక్సీలో గోవా నుంచి కర్ణాటకకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితురాలు సుచనా సేథ్‌ (39) బెంగళూరుకు చెందిన మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌ అనే ఓ స్టార్టప్‌ కంపెనీ సీఈవోగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నాలుగేళ్ల చిన్నారి హత్యకు గల అసలు కారణాన్ని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన బిడ్డను తన చేతులతోనే ఎందుకు చంపుకుందో ఎట్టకేలకు సుచన బయటపెట్టింది. కలంగుటే పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పరేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుచనా సేత్‌ (39), వెంకట్ రామన్‌కు 2010లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2019లో ఓ మగబిడ్డ జన్మించింది. అయితే 2020లో కొన్ని కారణాల రిత్య ఈ జంట విడాకులు తీసుకుని ఎవరికి వారు వేరువేరుగా జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం తన బిడ్డను కలుసుకునేందుకు కోర్టు తండ్రికి అనుమతిచ్చింది. కానీ తన మాజీ భర్త తన కొడుకును కలుసుకోవడం సుచనకు ఏ మాత్రం ఇష్టం లేదు. భర్త తన బిడ్డను కలవడానికి ముందే ఆమె బిడ్డను హతమార్చింది.

కాగా మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌ అనే స్టార్టప్ ఫౌండర్, సీఈవో సుచన సేథ్‌ గోవాలోని ఓ హోటల్‌లో గత శనివారం తన నాలుగేళ్ల కుమారితో బస చేసింది. 2 రోజుల తర్వాత హోటల్ నుంచి బెంగుళూరు వెళ్లేందుకు సూట్ కేస్‌తో బయల్దేరింది. ఆమెతో వచ్చిన చిన్నారి ఎక్కడుందని హోటల్ సిబ్బంది ఆమెను అడిగారు. అప్పుడు సుచన తన కుమారుడిని బంధువుల ఇంటికి పంపించానని అబద్ధం చెప్పి ట్యాక్సీలో బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో అనుమానం వచ్చిన హోటల్ యజమాని గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. షాక్‌కు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది గోవా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సుచన ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేశారు. హైవేకి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద కారు ఆపమని సూచించారు. పోలీసుల సూచనల మేరకు 4వ నెంబరు జాతీయ రహదారిపై ఐమంగల్ స్టేషన్ సమీపంలో డ్రైవర్ టాక్సీని ఆపి నిందితురాలు సుచనను ఐమంగల్ పోలీసులకు అప్పగించారు. కారులో తనిఖీ చేయగా సూట్‌కేస్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించి, నిందితురాలు సుచనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.