మధుర :
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో సభ్యసమాసం సిగ్గుపడే సంఘటన చోటు చేసుకుంది. ఖననానికి చితిపై తల్లి మృతదేహం సిద్ధంగా ఉన్న సమయంలో ఆస్తికోసం కూతుళ్ల మధ్య వివాదం నెలకొంది. తల్లి మృతదేహం శ్మశాన వాటికలో ఉండగానే కుమార్తెలు పంచాయితీ పెట్టారు. విషయం తేలే వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి వీళ్లేదంటూ తెగేసి చెప్పారు. దీంతో దాదాపు 8 నుంచి 9 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మృతురాలి కుమార్తెల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని మసానిలో ఉన్న శ్మశాన వాటికలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పుష్ప (85) అనే మహిళకు మిథిలేష్, సునీత, శశి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమెకు మగ సంతానం లేదు. తాజాగా ఆమె మృతి చెందింది. దీంతో మృతురాలి ఆస్తి విషయంలో ముగ్గురు కుమార్తెలు స్మశాన వాటికలోనే గొడవపడ్డారు. దీంతో మహిళ అంత్యక్రియలు చాలా గంటలపాటు వాయిదా పడింది. శ్మశాన వాటిక వద్ద కూతుళ్ల హైడ్రామా గంటల తరబడి కొనసాగడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన పండితుడు కూడా వెనుదిరిగాడు. అంతిమ యాత్రకు హాజరైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆసహనానికి గురయ్యారు. అనంతరం స్టాంపు పేపర్లు తెచ్చి భూమిని రాతపూర్వకంగా పంపిణీ చేయగా గొడవ సర్దుమనిగింది.
అసలు వివాదం ఏంటంటే..
యమునాపర్ పోలీస్ స్టేషన్‌లోని గ్రామం లోహవన్లో నివాసం ఉంటోన్న పుష్ప పెద్ద కూతురు మిథిలేష్ వద్దనే పుష్ప గతకొంత కాలంగా ఉంటోంది. ఆ సమయంలో మిథిలేష్ తన తల్లి అంగీకారం మేరకు సుమారు ఒకటిన్నర బిఘా (ఒక బిఘా భూమి 968 చదరపు గజం ఉంటుంది) భూమిని విక్రయించింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పుష్ప మృతి చెందింది. బంధువులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మిథిలేష్ కుటుంబ సభ్యులు పుష్ప మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మసానిలోని మోక్ష్ ధామ్ (స్మశాన వాటిక)కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పుష్ప ఇద్దరు కుమార్తెలు సునీత, శశి కూడా శ్మశాన వాటికకు చేరుకున్నారు. అక్క మిథిలేష్ ఆస్తి కాజేసిందంటూ ఆరోపిస్తూ తల్లి అంత్యక్రియలను ఆపేశారు. తల్లిదండ్రుల ఆస్తి సమానంగా పంచాల్సిందేనంటూ నానాయాగి చేశారు. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లిద్దరూ మిథ్లేష్తో గొడవ పడ్డారు. తమ తల్లికి ఉన్న మిగిలిన ఆస్తిని తమ పేరు మీదకు బదలాయించాలని, అప్పటి వరకూ అంత్యక్రియలు జరగడానికి వీల్లేదంటూ అక్కచెల్లెల్లు డిమాండ్ చేశారు. అయితే దీనికి మిథిలేష్ అంగీకరించలేదు.
అక్కాచెల్లెళ్ల మధ్య ఈ గొడవ చాలా సేపు కొనసాగింది. దీంతో శ్మశాన వాటికలో పనిచేస్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చినా ముగ్గురు అక్కాచెళ్లిళ్లకు సర్దిచెప్పడంలో విఫలమయ్యారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మిగిలిన ఆస్తిని శశి, సునీత పేరు మీదకు బదిలీ చేస్తానని మిథ్లేష్ రాత పూర్వకంగా అనుమతి తెల్పడంతో గొడవ సర్దుమనిగింది. అనంతరం అంత్యక్రియలు జరిగాయి. ఈ మొత్తం సంఘటన సుమారు 8 నుండి 9 గంటలపాటు నడిచింది. అప్పటి వరకూ మృతదేహాన్ని శ్మశాన వాటికలోనే ఉంచారు. సినిమాటిక్‌గా ఉన్న ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది.