సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 4 బ్యాగులతో లేడీ ప్యాసింజర్‌… అనుమానంతో చెక్‌ చేయగా..,

హైదరాబాద్ :

రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తూ ఓ మహిళ పట్టుబడింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ.11.5 లక్షల విలువైన 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మహిళను ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన శిల్పా నాయక్ (27) గా గుర్తించారు. డ్రగ్స్ వ్యాపారి పరారీలో ఉన్నాడు. అతడిని రాజీవ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన శిల్పా నాయక్ భర్త 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తన ఆరేళ్ల కొడుకు, వయసు మళ్లిన తల్లిదండ్రులను ఆమె పోషిస్తోంది. కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో శిల్పా నాయక్‌కు రాజీవ్ కుమార్ పరిచయం అయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించే మార్గం అతని ద్వారా శిల్ప తెలుసుకుంది. ఈ క్రమంలో అతనితో కలిసి శిల్ప డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించింది. ముంబైలో గంజాయికి మంచి డిమాండ్ ఉందని, గంజాయి వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చని రాజీవ్‌ ఆమెకు చెప్పాడు. ఒడిశాలోని మోహనా అటవీ ప్రాంతం నుంచి ముంబైకి రవాణా చేసి, అక్కడి వినియోగదారులకు విక్రయించవచ్చని రాజీవ్ ఆమెకు చెప్పాడు. అందుకు అంగీకరించిన శిల్ప అతనితో చేతులు కలిపింది.

ఈ క్రమంలో ముందుగా అనుకన్న పథకం ప్రకారం.. ఇద్దరూ జనవరి 16న మోహన అటవీ ప్రాంతానికి వెళ్లి 46 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దీనిని నాలుగు లగేజీ బ్యాగుల్లో ప్యాక్ చేశారు. అదే రోజు ఇద్దరూ పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలులో జనవరి 17న ముంబైకి వెళ్లాలన్నది వీరి ప్లాన్. కానీ అనూహ్యంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శిల్ప పట్టుబడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు శిల్పా నాయక్‌ లగేజీని చెక్‌ చేయగా భారీ మొత్తంలో గంజాయి లభ్యమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.5లో మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజీవ్‌ను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు సీనియర్ జీఆర్‌పీ అధికారి తెలిపారు.