కొరియర్ పేరుతో వ్యాపారికి టోకరా… కోటి రూపాయలు స్వాహా…

సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకూ మరింత రెచ్చిపోతున్నారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి.. 98 లక్షల రూపాయలు దోచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ హైదరాబాద్ కు చెందిన వ్యాపారిని సైబర్ చీటర్స్ బెదిరించారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సల్ వచ్చిందని.. అందులో మత్తు మందులు ఉన్నాయని వ్యాపారిని భయపెట్టారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని సైబర్ నేరగాళ్లు సూచించారు.

దీంతో వారు చెప్పిన అకౌంట్ కి 98 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు ఆ వ్యాపారి. కొద్దిసేపటికి అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. క్షణాల్లోనే ఆ అకౌంట్ నుంచి 11 బ్యాంక్ అకౌంట్ లకు నగదు ట్రాన్స్ ఫర్ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే అప్పటికే 15 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేయగా.. 83 లక్షల నగదును ఫ్రీజ్ చేయగలిగినట్లు వెల్లడించారు. ప్రజలు సైబర్ ఫ్రాడ్ లు, బ్యాంకింగ్ లావాదేవీల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.