నకిలీ పాస్‌పోర్టుల కలకలం… CID రైడ్స్… వెలుగులోకి సంచలన విషయాలు…

జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంపై ఉక్కుపాదం మోపారు సీఐడీ అధికారులు. గల్ఫ ఏజెంట్లు నకలి పాస్‌పోర్టుల అక్రమ దందా సాగిస్తున్నారన్న ఫిర్యాదుతో కోరుట్లలో దాడులు నిర్వహించారు. నాలుగు స్పెషల్ టీంలుగా రంగంలోకి దిగిన అధికారులు.. పలువురు పాస్‌పోర్టు ఏజెంట్‌ల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ రైడ్స్‌లో ఒకటి రెండు కాదు.. వందలాది బోగస్‌ పాస్‌పోర్టులు సృష్టించారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు, పాస్‌పోర్ట్‌ మార్ఫింగ్‌కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఉన్న సూత్రధారులెవరు..? ఇంకా ఎన్ని నకిలీ పాస్‌పోర్టులు సృష్టించారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడ నకిలీ పాస్‌పోర్టులతో పట్టుడటంతో విషయాన్ని ఇక్కడికి అందిండంతో బోగస్‌ పాస్‌పోర్టుల దందా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్‌ సీఐడీ అధికారులు కోరుట్లలో దాడులు చేపట్టారు. నకలీ పత్రాలను సృష్టించి బోగస్‌ పాస్‌పోర్టుల తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం ఏజెంట్లు భారీగా నగదును వసూలు చేసినట్టు తెలుస్తోంది.

కాగా,.. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో యథేచ్చగా సాగించన ఈ దందాలో పోలీసుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాస్ట్‌పోర్టు జారీ చేయాలంటే చాలా ఎంక్వైరీలు ఉంటాయి కాబట్టి ఏజెంట్ల చేతికింద పని చేసిన ఖాకీలు ఎవరు..? ఏ మేర అవినీతికి పాల్పడ్డారన్న దానిపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.