రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు… హైదరాబాద్ వ్యాపారి నుంచి 98లక్షలు కాజేశారు… ఎలాగో తెలిస్తే షాకే

తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి 98లక్షలు కాజేశారు సైబర్ చీటర్స్. ఆ నిధులను ఏకంగా 11 బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. అయితే, అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు.. 83లక్షల నగదును తిరిగి రాబట్టగలిగారు. 15లక్షలు అప్పటికే నిందితులు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. తాము కేంద్ర దర్యాఫ్తు సంస్థకు చెందిన అధికారులం అంటూ పరిచయం చేసుకున్నారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సిల్ వచ్చిందని, అందులో మత్తుపదార్ధాలు ఉన్నాయని నిందితులు వ్యాపారిని బెదిరించారు. కేసు పెడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. దీంతో వ్యాపారి బాగా భయపడిపోయాడు. తనను రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు.

తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎందుకో అతడికి అనుమానం వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు.. డబ్బు ఎక్కడికి వెళ్లిందన్న విషయమై దర్యాఫ్తు చేశారు

కట్ చేస్తే.. కశ్మీర్ లోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంకులోని జుజు అనే వ్యక్తి అకౌంట్ లో డబ్బు జమ అయినట్లు గుర్తించారు పోలీసులు. అక్కడి నుంచి వేర్వేరు రాష్ట్రాల్లోని ఐదు బ్యాంకులకు డబ్బులు మళ్లించారని తేల్చారు పోలీసులు. ఆ ఐదు బ్యాంకుల వద్ద వివరాలు సేకరిస్తే మరో ఆరు ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయని తేలింది. దీంతో ఆ డబ్బులు ఎవరూ డ్రా చేయకుండా నిలిపివేయాలని పోలీసులు కోరారు. కానీ, అప్పటికే సైబర్ నేరగాళ్లు 15లక్షలు డ్రా చేసేశారు. మిగతా 83లక్షలను పోలీసులు రాబట్టారు.

సైబర్ నేరాల పట్ల పోలీసుల విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఎంతో ఈజీగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. వాళ్లు చెప్పింది గుడ్డిగా నమ్మేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరికైనా ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.