మద్యం వ్యాపారం… ఇదో మార్గం…

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇదేదో కొత్తగా అమలు చేయబోతున్న అంశం అనుకుంటే పొరపాటే… మద్యం వ్యాపార రంగంలో ఎలైట్‌ బార్లు అనేకం ఇప్పటికే మనుగడలో ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో 2, సత్తుపల్లిలో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఓ ఎలైట్‌ బార్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి.

ఇదో దారి…

మద్యం వ్యాపారంలోకి రావాలనుకునేవారు ఎలైట్‌ బార్‌లను ఓ దారిగా ఎంచుకుంటున్నారు. మద్యం దుకాణం అయితే లాటరీ తగలాలి. బార్‌ లైసెన్స్‌ పొందాలంటే అంత సులభంగా లభించదు. అనుమతులు, కమిషనర్‌ స్థాయి నుంచి పరిశీలనలు ఇవన్నీ ఎందుకు అనుకునే కొందరు… నడవడం లేదు అని ముద్రపడిన బార్‌లను లీజుకు తీసుకొని నడిపించడంపై ఆసక్తి చూపుతున్నారు. ఇదంతా అనధికార ప్రక్రియ. ఇవన్నీ వద్దని పెద్ద పెట్టుబడి పెట్టి ఓ స్థాయిలో వ్యాపారం సాగించాలనుకునే వారు ఎలైట్‌ బార్‌లను దగ్గరి దారిగా భావిస్తున్నారు. ఖమ్మం నగరంలో మాత్రం ఇలాంటివి పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇప్పటికే ఇక్కడ అవసరానికి మించిన బార్లు ఉన్నాయనే వాదన ఉంది. ఖమ్మం జిల్లాలో 37 ఉండగా ఇందులో 30 ఖమ్మంలోనే ఉన్నాయి. అదనంగా రెండు క్లబ్బులూ ఉండటంతో ఎలైట్‌లు మధిర, సత్తుపల్లి పట్టణాల్లో రెండేసి చొప్పున వెలిశాయి. ఆశావహులు ఉంటే ఎలైట్‌ విధానంలోనే మరికొన్నింటికీ అనుమతులు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందనే చర్చ ఆబ్కారీ శాఖలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 బార్లు ఉండగా కొత్తగూడెం పట్టణంలో 6, ఇల్లెందులో 2, పాల్వంచలో 5 ఉండగా ఇందులో ఒక ఎలైట్‌ బార్‌ ఉంది.

ఎలైట్‌బార్‌ అంటే…

సాధారణ బార్‌కు పూర్తి భిన్నంగా ఎలైట్‌ బార్‌లో ఆధునిక సదుపాయాలు, పూర్తిస్థాయి ఏసీ ప్రాంగణం, అదే స్థాయిలో వంటశాల, సిబ్బంది ఉండాలి. సాధారణంగా ఏర్పాటైన బార్‌ ఖమ్మం నగర పరిధిలో అయితే ఏడాదికి రూ.42 లక్షలు, మధిర, సత్తుపల్లి ఇతర పట్టణాలో అయితే రూ.30 లక్షలు చెల్లించి ఏటా పునరుద్ధరించుకోవాలి. అదే ఎలైట్‌ బార్‌ తీసుకున్న వారు ఇందుకు అదనంగా 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ఎలైట్‌ రూపంలో చేరాక…

ఎలైట్‌ బార్‌ రూపం సంతరించుకొని వ్యాపారంలోకి చేరాక ఆ నిబంధనలను పాటిస్తూ కొనసాగడం కష్టం. నిబంధనలు పాటించలేని పక్షంలో అన్ని రకాలుగా అదనపు భారం మోయక తప్పదు. ఈ విషయం గ్రహించిన ఖమ్మం నగరంలోని మద్యం వ్యాపారులు ఎలైట్‌కు దూరంగా ఉంటున్నారని విశ్రాంత ఆబ్కారీ అధికారి ఒకరు వివరించారు. బార్లు కాకుండా ఎలైట్‌ దుకాణాలు తెచ్చే ఆలోచనలు ఉన్నత స్థాయిలో ప్రభుత్వానికి సూచిస్తున్నారు. బెల్ట్‌ దుకాణాలకు ప్రత్యామ్నాయం ఉంటే ఇప్పుడున్న ఆదాయం రెట్టింపు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎలైట్‌ వ్యాపారం కూడా ఇందులో ఓ భాగమని ఓ అధికారి వివరించారు.