హైదరాబాద్ :
గత కొంత కాలంగా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రవీణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లా కొయ్యవారిపాలెంకు చెందిన పలెపోగు సిద్దయ్య (44) హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలుచోట్ల పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరించడం మొదలు పెట్టాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు.
ఇలా మర్రిపుడి పీఎస్, కొండపి పీఎస్, కావలి పీఎస్, ఒంగోలు పీఎస్, సింగరాయకొండ పీఎస్, పొదిలి పీఎస్, టంగుటూరు పీఎస్, ఒంగోలు పీఎస్ పరిధిల్లో 15 బైకులను అపహరించడంతో 2020లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన అనంతరం సిద్ధయ్యపై ఏపీలో స్థానికంగా పోలీసులు నిఘా ఉంచారు. దీంతో అతడు హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కూలీ పని చేస్తున్నట్లు నటిస్తూ నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో పార్కు చేసిన బైకులను అపహరించడం మొదలు పెట్టాడు. పాత బైకుల తాళాలు సులువుగా తీయవచ్చునని గ్రహించిని సిద్ధయ్యా.. ఎక్కువగా పాత బైకులనే ఎంచుకునే వాడు. తాపీగా బైకుల వద్దకు వచ్చి తన వద్ద ఉన్న తాళాలతో బైక్‌లను దొంగిలించేవాడు. ఇలా 2023లో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో ఐదు బైకులను అపహరించాడు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్‌లో బైకును దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్పెషల్ టీమ్ పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితుడు సిద్ధయ్య నేరం అంగీకరించాడు. మొత్తం 20 బైక్‌లను అపహరించినట్లు తెలిపారు. ఎల్బీనగర్లో 5 బైకులు, ఉప్పల్‌లో 5 బైకులు, కూకట్‌పల్లిలో 3 బైకులు, మియాపూర్‌లో 2 బైకులు, కేపీహెచ్బీలో 1 బైకు, గుంటూరులో 1 బైకును అపహరించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. మరో 3 బైకుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడు సిద్ధయ్యాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.