విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును చేధించారు పోలీసులు. భోగాపురం మండలం మహారాజుపేటలో అప్పయ్యమ్మ అనే 76 సంవత్సరాల వృద్ధురాలు అనుమానస్పదంగా మృతి చెందింది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం తన ఇంటి బయట అందరితో సరదా సరదాగా మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయిన వృద్ధురాలు మరుసటి రోజు సాయంత్రానికి కూడా బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా వెతికారు. ఇంట్లో కనిపించకపోవడంతో లోపలే ఉన్న మరుగుదొడ్డిని కూడా పరిశీలించగా.. అక్కడ అప్పయమ్మ ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడి ఉంది. అందరూ వృద్ధురాలు కాలుజారి ప్రమాదవశాత్తు మరుగుదొడ్డిలో పడి మృతి చెందిందని అనుకున్నారు. ఆ తర్వాత వైజాగ్లో నివాసముంటున్న తన కుమార్తె నల్ల గంగమ్మ.. అప్పయమ్మ మృతదేహం వద్దకు వచ్చి చూడగా ఒంటిపై ఉన్న ఆభరణాలు లేకపోవడంతో హత్యగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పయ్యమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోస్ట్మార్టం నివేదిక ప్రకారం అప్పయ్యమ్మను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దీంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు
భర్త చనిపోవడం, కుమార్తె కూడా వివాహం తరువాత వైజాగ్లో నివాసం ఉండటంతో ఒంటరిగా తన ఇంట్లోనే జీవనం సాగిస్తోంది అప్పయ్యమ్మ. ఆమెకు మూడు ఇళ్లు ఉన్నాయి. అన్నీ కూడా ఒకే చోట ఒకదాని ప్రక్క మరొకటి ఉన్నాయి. అయితే ఆమె ఒక ఇంట్లో నివాసం ఉంటూ.. మరో రెండు ఇళ్లు అద్దెకు ఇచ్చింది. అలా అర్జున్ అనే బీటెక్ విద్యార్థి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అప్పయమ్మ ఇంటికి సమీపంలో ఉండే ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే అర్జున్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన అర్జున్ నిత్యం మద్యం సేవిస్తూ అల్లరిచిల్లరగా ప్రవర్తిస్తుండేవాడు. అంతేకాకుండా ఇంటికి అమ్మాయిలను కూడా తీసుకురావడంతో ఇంటి యజమాని అప్పయమ్మ అర్జున్ను వారిస్తుండేది. ఈ క్రమంలోనే ఈ నెల 24న సాయంత్రం అప్పయమ్మ అర్జున్ ఉంటున్న ఇంటికి వెళ్లి అర్జున్ చెడు ప్రవర్తనను మరోసారి నిలదీసింది.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న అర్జున్ వెంటనే తీవ్రమైన కోపంతో అప్పయమ్మపై దాడి చేసి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బాత్రూమ్లో కాలుజారి పడిందని నమ్మించేలా పక్కా స్కెచ్ వేశాడు. అలా పథకం ప్రకారం మృతి చెందిన అప్పయ్యమ్మ మృతదేహాన్ని దుప్పట్లో కట్టి అప్పయ్యమ్మ ఇంట్లోకి తీసుకెళ్లి మరుగుదొడ్డిలో పడేశాడు. అలా పడేసి వెనక్కి వస్తుండగా అప్పయమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది. అప్పటికే చెడు అలవాట్లతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న అర్జున్ అప్పయ్యమ్మ ఒంటిపై ఉన్న అభరణాలను కాజేసి తనకేమీ తెలీనట్టు అక్కడ నుండి వెళ్లిపోయాడు. అయితే పోలీసులు అప్పయ్యమ్మ ది హత్య అని నిర్ధారణకు రావడంతో విచారణ వేగవంతం చేశారు. ఈ విచారణలో చెడు అలవాట్లకు బానిసైన అర్జున్ అప్పయ్యమ్మను హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేసి అప్పయ్యమ్మ వద్ద కాజేసిన బంగారాన్ని రికవరీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి బంగారు భవిష్యత్తు పొందాల్సిన అర్జున్ చెడు అలవాట్లకు బానిసై జీవితాన్ని కటకటాలపాలయ్యేలా చేసుకున్నాడు. ఇదే ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.