పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం… BRS MLC కవిత

హైదరాబాద్ :

విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం.

ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే నల్లబుగ్గలు ఎగరేసి నిరసనలు తెలుపుతాం.

కేసీఆర్ కుటుంబంపై ఏడుస్తున్న రేవంత్ రెడ్డి… 22 కుటుంబాలకు కాంగ్రెస్ టికెట్లు ఎలా ఇచ్చారు.

రేవంత్ రెడ్డి పాలనలో కొరవడిన సామాజిక దృక్కోణం.

రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాళ్లు మొక్కారు కానీ జై తెలంగాణ అని అనలేదు.

అమరవీరులకు నివాళలుర్పించని సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా సూటిగా చెప్పాలి.

కులగణన ప్రక్రియను తక్షణమే మొదలుపెట్టలి.

బీజేపీకి భయపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.

ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు.

నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని పడగొడుతారు.

సీఎం రేవంత్ రెడ్డి ముఠామేస్త్రీలా మాట్లాడుతున్నారు….ఆయనను ప్రజలు యూ-టర్న్ సీఎం అని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధానాన్ని వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే నల్లబుగ్గలు ఎగరేసి నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని ప్రశ్నించారు. జార్ఖాండ్ ఎమ్మెల్యేల క్యాంపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తుందా లేదా ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాళ్లు మొక్కరే తప్పా జై తెలంగాణ అని అనలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక ధృక్కోణం కొరవడిందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గానూ తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెల్లారిలేస్తే కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 22 కుటుంబాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

భారత జాగృతిపై, తనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని సూచించారు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హెలికాప్టర్ లో వెళ్లి పార్టీ సభలో పాల్గొనడం ఏంటని అడిగారు. సభకు పెట్టిన ఖర్చు ఎంత ? వసతులు వాడుకున్నందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డబ్బు చెల్లించిందా అని చెప్పాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమని, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చెప్పట్టినా అమరవీరులకు క్షమాపణలు చెప్పి మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముఠామెస్త్రీలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వపరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఏ హోదాలో ప్రియాంకా గాంధీని పిలుస్తారని ప్రశ్నించారు. “ఆమె కనీసం దేశంలో ఏ ఒక్క గ్రామం నుంచి అయినా సర్పంచ్ గా గెలిచిందా ? ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలిచారా ? రాష్ట్రంలో ఏ ప్రోటోకాల్ లో అయినా ఉందా ఆమె ? మీ పార్టీకి చెందిన ముఖ్యనాయకురాలైతే ఇంటికి పిలుచుకొని మీ మనువడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరసారె పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తామంటే తప్పకుండా నల్లబుగ్గలు ఎగరేసి నిరసన తెలియజేస్తాం” అని హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టడం చాలా తప్పని, తెలంగాణ ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తే, ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే తప్పకుండా తాము నిరసనలు తెలియజేస్తామని పునరుద్ఘాటించారు.

తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి మంత్రులైన వారు జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ లను పెట్టి రిసార్టులో క్యాంపులు నిర్వహించడం ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ వాళ్లలాగా అడ్వర్టైజ్ మెంట్లు వేయమని ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రకటనలు ఇస్తున్నారని, ప్రకటనలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోతారని విమర్శించారు. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్తున్న రీత్యా దాని ఖర్చు ఎంతో ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తాము పడగొట్టాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ నాయకులే పడగొడుతారని స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వెనక్కితీసుకునేలా ఒత్తిడి చేసిన నల్గొండ నాయకులు ఎవరన్నది అందరికీ తెలుసునని, కాబట్టి అదే నల్గొండ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులే పడగొడుతారని అన్నారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉండడం… రేపొక ముఖ్యమంత్రి ఉండడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండమన్నారని, తాము ప్రతిపక్షంలో ఉంటామని తేల్చిచెప్పారు.

శిశుపాలుడి వంద పాపాలు పండినట్లుగా వందరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులు పండుతాయని, అప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా నిలదీస్తామని తెలిపారు. కానీ గత 60 రోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలకు యూ-టర్న్ ముఖ్యమంత్రిగా పిలుస్తున్నట్ల తెలుస్తోందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాదర్భార్ పెట్టి రోజూ ప్రజలను కలుస్తానని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ కేవలం ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారని ఎండగట్టారు. ప్రజాదర్భార్ ను నిర్వీర్యం చేయడానికి ఒక రోజు మంత్రిని కూర్చోబెట్టారని, ఆ తర్వాత అధికారులను కూర్చొబెట్టారని, అనంతరకాలంలో హైదరాబాద్ కు రావడం ఎందుకని జిల్లాల్లోనే ప్రజాపాలన పెడుతామన్నారని వివరించారు. ప్రజల వద్దకే పాలన వెళ్లాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను, మండలాలను, గ్రామాలను ఏర్పాటు చేసిందని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఇలా పరిపాలన వికేంద్రీకరణ కోసం తాము చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కేంద్రీకృతం జరగాలని కోరుకుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన బాటలోకి రావడం చాలా సంతోషమన్నారు. ప్రజల వద్దకే పాలన పోవాలి కానీ పాలకుల వద్దకు ప్రజలు రాకూడదన్న నిరూపించిన కేసీఆర్ తొవ్వ సరైనదని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే, తాను ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ ఆపవద్దని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని, కానీ సీఎం కాన్వయ్ వెళ్తుంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపుడుతున్నారని విమర్శించారు.

కుటుంబ పాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పికొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు అధికారిక సమీక్షా సమావేశాల్లో కూర్చకుంటున్నారని, కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జిలుగా ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సోదరులు ఏమేం పనులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని, సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా బయటపెడుతామని స్పష్టం చేశారు. తెల్లారిలేస్తే కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 22 కుటుంబాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. గడ్డం వినోద్ – బెల్లంపల్లి గడ్డం వివేక్ సోదరులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులు, తండ్రికొడుకులైన మైనంపల్లి హనుమంత రావు – రోహిత్ రావు, భార్యభర్తలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి – పద్మావతి రెడ్డి, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడు జువ్వాడి నరసింగా రెడ్డి, ఆయన కుటుంబ సభ్యడు కూచాడి శ్రీహరి రావు, మాజీ స్పీకర్ శ్రీపాద రావు కుమారుడు దుద్దిళ్ల శ్రీపాద రావు, మాజీ ఎంపీ సింగపురం రాజేశ్వర రావు మనువడు వొడితెల ప్రణవ్, మాజీ మంత్రి సీ రాజనరసింహా కుమారుడు దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పీ జనార్ధన్ రెడ్డి కుమార్తె పీ విజయా రెడ్డి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ ఖేరా భార్య కోట నీలిమా, మాజీ ఎమ్మెల్యే నర్సి రెడ్డి మనువరాలు చిట్టెం పర్ణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మాజీ మంత్రి కే జానా రెడ్డి కుమారుడు కే జయవీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీ భర్త కొండా సురేఖ, మాజీ ఎంపీలు మల్లు అనంతరాములు, మల్లు రవిల సోదరుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టా రెడ్డి పట్లోళ్ల సంజీవ రెడ్డి వంటి అనేక రాజకీయ కుటుంబాలకు చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని వివరించారు. ఇన్ని రాజకీయ కుటుంబాలకు టికెట్లు ఇచ్చిన రేవంత్ రెడ్డికి తమపై మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను తట్టడం తప్పా తెలంగాణ ప్రజలకు ఏం పనిచేస్తున్నారని అడిగారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ అని నినాదం చేయడమే కాకుండా సోనియా గాంధీ కాళ్లుమొక్కారే కానీ జై తెలంగాణ అని అనలేదని ఎండగట్టారు. అమరవీరులకు ఒక్కసారి కూడా నివాళులర్పించలేదని, అమరజ్యోతికి ఒక్కసారి కూడా వెళ్లలేదని, అటువంటి వ్యక్తి కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారంటే… సీఎం నీతి ఏంది ? నైజం ఏంది ? వైఖరి ఏంది ? లక్ష్యం ఏంది? అన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాకట్టుపెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కాబట్టి పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తారా లేదా అన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11లోగా సానూకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా మంత్రులు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ తనను విమర్శిస్తున్నారని, కానీ తమ డిమాండ్ వల్ల అత్యధికంగా లాభం పొందేది పొన్నం ప్రభాకరేనని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలని కోరుతున్నామంటే… బీసీలకే లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ కులగణన చేపడుతామని బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, ఇప్పటికే రెండు నెలలు గడిచినా ఇంత వరకు ప్రక్రియను ప్రారంభించలేదని చెప్పారు. కులగణన చేపట్టకపోతే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఇచ్చిన హామీ మేరకు బీసీల కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు రోజులు గడుస్తున్నా స్పందించకపోవడం దారుణమన్నారు. ఎందు కోసం మాట్లడడం లేదా? ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి వంతపాడుతూ రక్షించడం లేదా అని నిలదీశారు. బీజేపీని ఎందుకు ఎండగట్టడం లేదని అడిగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా మాట్లాడలేదని విమర్శించారు. అలాగే, నియామకాల్లో ఎస్సీలు, బీసీల వాటా ఎంత అన్నది చెప్పాలని సూచించారు. రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక ధృక్పథం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ అంటేనే సబ్బండవర్ణాల జాతి అని, కాబట్టే పార్టీ పెట్టిన నాడే ప్రతి కమిటీలో 50 శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారని, ఆ మేరకు 2001 నుంచి ఇప్పటి వరకు పార్టీలో అన్ని కమిటీల్లో బీసీలకు 51 శాతం వాటా ఇస్తున్నామని వివరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 50 చైర్మన్ పోస్టులు భర్తీ చేస్తే అందులో 24 పోస్టుల్లో బీసీలకు నియమించామని గుర్తు చేశారు.

నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత సమాధానమిస్తూ…. పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా అని వ్యాఖ్యానించారు. తమది కాంగ్రెస్ పార్టీలా కాదని, క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీలో తమకు తాము ప్రకటించుకోబోమని, పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.

విలేకరుల సమావేశంలో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపధ్యక్షుడు, మాజీ కార్పొరేషన్ మేడే రాజీవ్ సాగర్, యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకులు గట్టు రామచందర్ రావు, తాడూరి శ్రీనివాస్, రాజారాం యాదవ్, బొల్ల శివశంకర్, ఆర్వీ మహేందర్, ఆలకుంట హరి, ఏల్చల దత్తాత్రేయ, గీతా గౌడ్, టీఆర్ఎస్కేవీ నాయకుడు రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.