మొన్న లావణ్య.. ఇప్పుడు మిథున, ప్రియ.. గలీజ్ దందాలో తెరపైకి వస్తున్న మగువల ముఖచిత్రాలు..

హైదరాబాద్ మహానగరంపై మత్తు మరక చెదరడంలేదు. ఉక్కుపాదం మోపినా సరే ఏమాత్రం బెదరడం లేదు. మత్తు గబ్బుకు కేరాఫ్‌గా మారిన పబ్‌ల్లో డ్రగ్‌ దందా సాగుతూనే ఉంది. గోవా నుంచి డ్రగ్స్‌ తెచ్చి పబ్‌ల్లో విక్రయిస్తోన్న మిథున, కొంగాల ప్రియ అనే మహిళల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఎండీఎంఏ సహా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే డ్రగ్‌ నకరాల్లో నైజీరియన్లు, మత్తుబాబులు పట్టుపడేవాళ్లు. ఇప్పుడు కథ మారింది. మత్తు దందాలో మగువల ముఖచిత్రాలు కూడా ఇలా తెరపైకి వస్తున్నాయి. అందుకు మరో నిదర్శనం నార్సింగిలో లావణ్య డ్రగ్‌ రాకెట్‌.

ఇటీవలే నార్సింగిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. లావణ్య అండ్‌ గ్యాంగ్‌ కు చెక్‌ పెట్టారు. వారి నుంచి MDMAను స్వాధీనం చేసుకున్నారు .. మ్యూజిషియన్‌గా చెప్పుకునే లావణ్యకు సినీ ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి. లావణ్య అండ్‌ కోతో ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్‌ లింక్స్‌ ఉన్నాయనే పాయింట్‌పై ఫోకస్‌ పెట్టారు పోలీసులు. లావణ్యతో పాటు ఉనీత్ రెడ్డి, ఇందిరాపై కేసు నమోదు చేశారు. ముగ్గురు కలిసి డ్రగ్స్ సేవించి, డ్రగ్స్ అమ్మేవారని గుర్తించారు. గోవా, బెంగుళూరు నుంచి ఉనీత్ రెడ్డి ఒక్కో గ్రాము 1500 చొప్పున డ్రగ్స్‌ కొని తెస్తే..లావణ్య ఇందిరా హైదరాబాద్‌ గ్రాము 6వేల చొప్పున విక్రయించే వారని దర్యాపులో తేల్చారు.

ఇక శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో డ్రగ్‌ రాకెట్‌ మరో హైలైట్‌. 2021లో 50 కోట్ల విలువైన 8 కేజీల హెరాయిన్‌ను బట్వాడా చేస్తూ పోలీసులకు పట్టుబడింది ఓ యువతి. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎట్టకేలకు ఇటీవలే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దర్యాప్తులో పక్కా సాక్షాలతో నిజాలు తేలడంతో మహిళకు 14 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది ఎల్బీనగర్‌ కోర్టు.

హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలోనూ డ్రగ్స్‌ అన్న మాట వినపడొద్దని.. మత్తు దందాలో ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌ రెడ్డి సభా వేదికగా హెచ్చరించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ ఆదేశాలతో పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ మరింత నిఘా పెంచారు. ఆక్రమంలోనే ఇలా మత్తు బ్యాచ్‌లకు చెక్‌ పడుతోంది. డ్రగ్‌ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం మరింత ఫోకస్‌ పెట్టింది. డ్రగ్స్‌ కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం బట్టీ విక్రమార్క్‌ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ పట్టుబడితే తక్షణ చర్యలు చేపట్టడమే సహా అలాంటి హోటళ్లు పబ్‌ల అనుమతులను రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పోలీసులు ఉక్కుపాదం మోపడంతో డ్రగ్‌ మాఫియా రూట్‌ మారుస్తోంది. యువతుల్ని మత్తు మందుకు బానిసల్ని చేసి వారిని డ్రగ్‌ స్మగ్లింగ్‌ రొంపిలోకి దింపుతోంది. తాజాగా తెరపైకి వచ్చిన కేసుల్లో యువతులు ఉండడం సంచలనంగా మారింది