వికటించిన స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్… కాబోయే వరుడి మృతి

వికటించిన స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్… కాబోయే వరుడి మృతి

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ డెంటల్ క్లినిక్ లో ఘటన

ఆపరేషన్ చేస్తుండగా కుప్పకూలిన యువకుడు

అనెస్థీషియా ఓవర్ డోస్ వల్లేనని బాధితుడి తండ్రి ఆవేదన

మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల పాడె పైకి చేరాడు. స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ వికటించడంతో ప్రాణం పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుందీ విషాదం. తమ కొడుకుకు ఎలాంటి అనారోగ్యం లేదని, వైద్యుల నిర్లక్ష్యమే అతడి మరణానికి కారణమైందని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సందర్భంగా అనెస్థీషియా ఓవర్ డోస్ వల్లే తమ కొడుకు చనిపోయాడంటూ సంబంధిత ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నగరానికి చెందిన లక్ష్మీనారాయణ వింజం (28) అనే యువకుడికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో తన ముఖంపై చిరునవ్వును తీర్చిదిద్దుకోవాలని లక్ష్మీనారాయణ భావించాడు. ఇందుకోసం సిటీలోని ఓ ప్రముఖ డెంటల్ హాస్పిటల్ డాక్టర్లను ఆశ్రయించాడు. స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ ద్వారా ముఖాన్ని తీర్చిదిద్దేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీనారాయణ తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్లిన లక్ష్మీనారాయణకు వైద్యులు అనెస్థీషియా ఇచ్చి సిద్ధం చేశారు.

అయితే, కాసేపటి తర్వాత లక్ష్మీనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించారు. తాము ఆసుపత్రికి చేరుకునే సరికే లక్ష్మీనారాయణ అపస్మారక స్థితిలో ఉన్నాడని బాధితుడి తండ్రి రాములు తెలిపారు. హుటాహుటిన దగ్గర్లోన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారన్నారు. దీనిపై రాములు వింజం పోలీసులను ఆశ్రయించారు. దంత వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అనెస్థీషియా ఓవర్ డోస్ కారణంగానే తమ కొడుకు చనిపోయాడని ఫిర్యాదు చేశారు.