గచ్చిబౌలి పోలీస్‏స్టేషన్‏కు డైరెక్టర్ క్రిష్.. డ్రగ్స్ కేసుపై విచారించనున్న పోలీసులు…

గచ్చిబౌలి పోలీస్‏స్టేషన్‏కు డైరెక్టర్ క్రిష్.. డ్రగ్స్ కేసుపై విచారించనున్న పోలీసులు..

హైదరాబాద్ రాడిసన్ పబ్‍లో డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల విచారణ వేగవంతగా సాగుతుంది.

ఈ కేసులో ఏ10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు పోలీసులు.

ఇందులో భాగంగా ఈరోజు (మార్చి 1న) విచారణకు హాజరుకానున్నారు క్రిష్.

తాను ముంబైలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని శుక్రవారం రోజు వస్తానని పోలీసులకు విజ్ఞప్తి చేశారు క్రిష్.

ఈరోజు గచ్చిబౌలీ పోలీసుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా? అనేది విచారణలో తేల్చనున్నారు.

అలాగే అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే క్రిష్‏ను విచారణకు హాజరు కావలసిందిగా స్పష్టం చేశారు గచ్చిబౌలీ పోలీసులు.

రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకీ అనుహ్య మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ సప్లైయర్ అబ్బాస్‏ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మీర్జా వహీద్ అనే వ్యక్తి దగ్గర కొకైన్ కొనుగోలు చేసి దానిని గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అప్పగిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఏ11గా వివేకానంద్ డ్రైవర్ గజ్జల ప్రవీణ్.. ఏ12గా మీర్జా వహీద్ పేరును చేర్చారు పోలీసులు. గతేడాది గజ్జల వివేకానంద డ్రగ్స్ కి బానిస అయినట్లుగా అబ్బాస్ విచారణలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులు క్రిష్, నిర్భయ్ సింధీతో పార్టీ జరుపుకున్నట్లు వెల్లడించాడు.

మరోవైపు తన చెల్లెలు లిషీ కనిపించడం లేదంటూ హీరోయిన్ కుషిత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి తన చెల్లెలు ఇంటికి రావడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాలని ఆమె కుటుంబసభ్యులకు సూచించారు పోలీసులు. అలాగే డైరెక్టర్ క్రిష్, చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు పంపించారు పోలీసులు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణకు హజరయ్యారు.