రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు బలైపోయాడు. రష్యా తరఫున పోరాడుతూ మహ్మద్ అఫ్సాన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి అక్కడి ఏజెన్సీ చేతిలో మోసపోవడంతో బలవంతంగా అక్కడి సైన్యంలో చేరాల్సి రావడం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అఫ్సాన్ సహా ముగ్గురు హైదరాబాద్ యువకులు ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయారని.. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ జనవరిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ క్రమంలో రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న 20 నుంచి 30మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించిన కొద్దిరోజుల్లోనే ఈ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.
మరోవైపు, ఈ విషాద ఘటనపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. అఫ్సాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన ఇలాంటి విషాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన యువకుల్ని తిరిగి తీసుకొచ్చేలా తగిన సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. మహ్మద్ అఫ్సాన్ మరణవార్త తమకు తెలిసిందని.. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. అఫ్సాన్ భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. …