మహబూబ్‌నగర్ :
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటా. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించా. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చాం. అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా. కేటీఆర్, హరీశ్‌రావును చూస్తే.. భారాస ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుంది. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.
పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం..
వంశీచందర్‌రెడ్డిని ఎంపీగా, జీవన్‌రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించండి. కృష్ణా జలాలు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశారు? త్వరలోనే పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నాం. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం. 11 వేలకు పైగా ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం. 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానిగా పదేళ్లు ఉండొచ్చు.. కానీ, ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరట. ఇదెక్కడి న్యాయం? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామనడం.. దేశానికి మంచిదా? విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలకు పాతరేయాలి. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు.. మా జోలికొస్తే అంతు చూస్తాం. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి కేసీఆర్‌ను రోడ్డుకు ఈడ్చా. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలి.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి’’ అని సీఎం అన్నారు..