అవును… ఎస్ 50 హార్డ్‌డిస్క్‌లలోని సమాచారాన్ని చెరిపేశాను…

అవును.. ఎస్ 50 హార్డ్‌డిస్క్‌లలోని సమాచారాన్ని చెరిపేశాను..

అంగీకరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌రావు.

ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ఈ పనిచేశానంటూ వాంగ్మూలం.

తొలిసారి తెరపైకి ప్రభాకర్‌రావు పేరు.

ప్రణీత్‌రావుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తాను నడుచుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో ప్రభాకర్‌రావు పేరు నిందితుడిగా రికార్డులకెక్కడం ఇదే తొలిసారి.

ప్రణీత్‌రావును 20 గంటలపాటు కస్టడీలో ఉంచి ప్రశ్నించిన పోలీసులు గత రాత్రి 8 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత సీసీటీవీలు ఆఫ్ చేసి కీలకమైన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి చెరిపివేసి ధ్వంసం చేసినట్టు ప్రణీత్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తానీ పనిచేసినట్టు విచారణలో ఆయన వెల్లడించినట్టు తెలిసింది.

‘‘ఎస్ఐబీ కార్యాలయంలోని దాదాపు 50 హార్డ్ డిస్క్‌లలోని డేటాను చెరిపేశాను. వాటి స్థానంలో కొత్తవి పెట్టాను’’ అని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన ఇంటి నుంచి ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 గంటల విచారణ అనంతరం ఆయనను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు.