కవితకు 23 వరకు ED కస్టడీ ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు…

దిల్లీ :

దిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన భారాస ఎమ్మెల్సీ కవితకు ఇక్కడి రౌజ్‌ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి దిల్లీకి తరలించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆమెను శనివారం ఉదయం ఇక్కడి రౌజ్‌ఎవెన్యూలోని ఈడీ, సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వారు పదిరోజుల కస్టడీకి అడగ్గా న్యాయమూర్తి ఏడురోజుల కస్టడీకి ఇచ్చారు. ఉదయం కోర్టులోకి వస్తూ కవిత తనది అక్రమ అరెస్ట్‌ అని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని విలేకర్లను ఉద్దేశించి గట్టిగా చెప్పారు. ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టుహాల్‌లోని బోనులో కూర్చోబెట్టారు. కవితతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆమె న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి వారికి కొంత సమయం ఇచ్చారు.

ఈడీ మనసులో ఒకటి, రాతలో ఇంకోటి…

తదుపరి విచారణ వరకు కవితపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని గత సంవత్సరం సెప్టెంబరు 15న ఈడీ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధరి ఆమె తరఫున వాదనలు వినిపించారు. ‘‘ఆమెకు సమన్లు ఇవ్వబోమని నాడు ఈడీ చెప్పగా ఆ విషయాన్ని రికార్డు చేయాలా అని ఆరోజు న్యాయమూర్తి అడిగారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు ఆ అవసరం లేదు అని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఈడీ చెప్పిన విషయాలన్నింటినీ కలిపి ఒక అప్లికేషన్‌ దాఖలు చేస్తాం. మహిళను విచారించే సమయంలో సంయమనం పాటించాలని ఇదివరకు సుప్రీంకోర్టు నళినీ చిదంబరం కేసులో చెప్పింది. కవిత కేసును కూడా ఆ పిటిషన్‌తో జతచేసి విచారిస్తున్నారు. శుక్రవారం కూడా ఆ కేసు విచారణ జరిగింది. ఈనెల 19న మరోసారి విచారణకు రానుంది. ఈలోపే ఆమెను అరెస్ట్‌ చేశారు. శుక్రవారం న్యాయచరిత్రలో బ్లాక్‌డే. ఆమెను ఇదివరకు 2023 మార్చి 11, 20, 21 తేదీల్లో విచారించారు. దానిపై ఆమె సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టిన తర్వాత ధర్మాసనం దాన్ని విచారణకు స్వీకరించింది. దర్యాప్తు సంస్థ ముందు విచారణకు రాకుండా కోర్టుకు వెళ్తారా.. ఎంత ధైర్యం మీకు అనే రీతిలో ఈడీ అధికారులు వ్యవహరించారు. ఈడీ మనసులో ఒకటి, రాతలో ఇంకోటి, చేతలో మరొకటి కనిపిస్తోంది. ఈకేసులో ఇప్పటికే ఒక ఛార్జిషీటు, 3 సప్లిమెంటరీ ఛార్జిషీట్లు దాఖలు చేశారు.