ప్రజాపాలన దరఖాస్తులతో దోపిడి… కంప్యూటరీకరణ చేయకుండా రూ. కోట్లు స్వాహా…

ప్రజాపాలన దరఖాస్తులతో దోపిడి… కంప్యూటరీకరణ చేయకుండా రూ. కోట్లు స్వాహా… ఏజెన్సీలకు రూ. లక్షలు దోచిపెట్టిన అధికారులు పథకాలు వర్తించక అర్హల అవస్థలు

హైదరాబాద్‌ :

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం. ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియను నిధుల దోపిడీ తంతుగా మార్చారు. ఉదాహరణకు.. లక్షలో దాదాపు 40వేల దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లలో నమోదుచేయలేదు. ఆయా ఏజెన్సీలవారికి బిల్లులను మాత్రం లక్ష దరఖాస్తులకు చెల్లించారు. ఇలా నగరం మొత్తంగా రూ.12 కోట్ల ప్రజాధనం వెచ్చించడం గమనార్హం. దరఖాస్తుల దశలోనే అవకతవకలతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నగరంలో అర్హులైన ప్రజలు పూర్తిస్థాయిలో అందుకోలేకపోయారు.

నమోదైంది 11లక్షలే

నగరవ్యాప్తంగా 600 కేంద్రాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల కోసం 19 లక్షలకుపైగా దరఖాస్తులందాయి. రేషన్‌కార్డు,  ఇళ్లు, ఇతర పథకాలకు మరో 5.7లక్షలు కలిపి మొత్తం 24.7లక్షల అర్జీలందాయి. ఆ వివరాలను కంప్యూటర్లలో నమోదుచేసే ప్రక్రియను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. కమిషనర్‌ ఉప కమిషనర్లు(డీసీ)కు బాధ్యత ఇచ్చారు. ఒక్కో దరఖాస్తుకు రూ.12 ఇవ్వాలని ఆదేశించారు. కొందరు డీసీలు ప్రకియను పారదర్శకంగా పూర్తిచేయగా.. మరికొందరు చేతివాటం ప్రదర్శించారు. చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌ జోన్లలోని సర్కిళ్లలో అవకతవకలు ఎక్కువగా జరిగాయి. దరఖాస్తుల్లో సమాచారాన్ని కంప్యూటర్లలోకి ఎక్కించకుండానే.. పని పూర్తయినట్లు ఏజెన్సీలతో బిల్లులు పెట్టించి, నిధులు చెల్లించారు. ః వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటరీకరణ జరిగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 14లక్షల మంది దీనికి అర్జీ పెట్టుకున్నారు. విద్యుత్తు శాఖకు మాత్రం 11లక్షల దరఖాస్తుల వివరాలే చేరాయి. అంటే.. ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులకు, ప్రభుత్వం, విద్యుత్తు శాఖలు తెలిపిన వివరాలకు పొంతన లేదని తెలుస్తోంది.

నకిలీ బిల్లులతో

చార్మినార్‌ జోన్‌లోని ఆరు సర్కిళ్లలో 5,08,772 దరఖాస్తులందగా, ఎస్వీ ప్రాజెక్ట్స్‌, జోయ్‌-ఈ, వీజేఎస్‌, హోమిత్‌, తదితర సంస్థలు కంప్యూటరీకరించారని బల్దియా బిల్లులు చెల్లించింది. ప్రజాపాలన సభలకు భోజనాలు, టీలు, బిస్కట్లు, దరఖాస్తుల సరఫరా.. ఇలా ఒక్కో సర్కిల్‌కు రూ.40లక్షల మేర చెల్లించారు. సదరు జోన్‌లో సగం దరఖాస్తుల కంప్యూటరీకరణ కూడా జరగలేదని అంతర్గత విచారణలో తేలింది. దరఖాస్తులపై ఏజెన్సీ నిర్వాహకులు 251664-3636928, 251664-4563631 వంటి సంఖ్యలు రాసి, కంప్యూటర్లలో సమాచారం చేర్చినట్లు నకిలీ బిల్లులు సృష్టించారని వెల్లడైంది. ఈతతంగం వెనుక ఉప కమిషనర్ల హస్తముందనే విమర్శలున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఇలా అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి……..