హైదరాబాద్ :
తెలంగాణలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నుంచి రైతువారీ పంట నష్టాలపై సర్వేకు ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి ఆదేశానుసారం రైతులకు సాయం అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వంపై భారాస నేతలకు విమర్శలు చేసే హక్కు లేదన్నారు.
బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ…..
అకాల వర్షాలతో రైతులు పంటలు కోల్పోవడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షపాత ప్రభుత్వమే. బుధవారం సీఎంతో సమావేశమై అకాలవర్షాల వల్ల గత మూడు రోజులు జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. మా ప్రభుత్వంపై భారాస నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
గత పదేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంట నష్టపోయారు. కేవలం ఎన్నికల సంవత్సరంలో మాత్రమే అప్పటి ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల పరిహారం ప్రకటించి కేవలం రూ.150 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ తర్వాత 1,25,000 ఎకరాల పంట నష్టం సంభవించినా సాయం చేయలేదు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100 శాతం పంటలు నష్టపోయినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. రుణమాఫీని సైతం అమలు చేయలేదు. రెండో విడత రుణమాఫీకి రూ.19,600 కోట్లకు గాను కేవలం రూ.9,500 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొంది. రైతుబంధు నిధులను గతంలో మే వరకు విడుదల చేసింది. ఇప్పుడు మార్చి నెలలోనే పథకాన్ని అమలు చేయలేదని భారాస నేతలు గగ్గోలు పెడుతున్నారు. నాటి ప్రభుత్వం విద్యుదుత్పత్తిని ప్రణాళిక ప్రకారం చేయకుండా నీటిని విడుదల చేసి నాగార్జునసాగర్ రిజర్వాయర్ను ఖాళీ చేసింది’’ అని తుమ్మల ధ్వజమెత్తారు.