కేజ్రీవాల్ అరెస్టు దుర్మార్గం… పినరయి విజయన్
న్యూఢిల్లీ :
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును కేరళ సిఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. అరెస్టు పూర్తిగా దుర్మార్గమైనదని, లోక్‌సభ ఎన్నికల ముందు అన్ని ప్రతిపక్ష పార్టీల గొంతును అణిచివేయడానికి ఒక పన్నాగంగా విజయన్ విమర్శించారు. అలాగే ఈ అరెస్టు ప్రజాస్వామ్య ప్రక్రియకు భయపడే వారి పిరికితనాన్ని వెల్లడిస్తుందని అన్నారు. అలాగే అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొవడానికి సమిష్టి చర్యలకు విజయన్ పిలుపునిచ్చారు.
ఖాతాలను స్తంభింపచేయడం నుంచి ముఖ్యమంత్రుల అరెస్టు వరకూ వెళ్లింది : రాహుల్ గాంధీ
దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నియంతృత్వం ఇప్పుడు ముఖ్యమంత్రుల అరెస్టు వరకూ వెళ్లిపోయిందని కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ విమర్శించారు. మీడియాతో సహా అన్ని సంస్థలను గుప్పిటలోకి తీసుకోవడం, పార్టీలను విభజించడం, సంస్థలను నుంచి డబ్బులు వసూలు చేయడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేయడం వరకూ చేసిన నియంతృత్వానికి అది సరిపోక ఇప్పుడు ముఖ్యమంత్రుల అరెస్టు వరకూ వెళ్లిందని రాహుల్ విమర్శించారు.
అధికారం కోసం బిజెపి ఎంతకు తెగిస్తుందో… శరద్‌పవార్
కేజ్రీవాల్ అరెస్టును నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శరద్‌పవార్ తీవ్రంగా ఖండించారు. అధికారం కోసం బిజెపి ఎంతకు తెగిస్తుందో, ఎంత లోతుకు దిగుతుందో కేజ్రీవాల్ అరెస్టుతో అర్థమవుతుందని విమర్శించారు. ‘ప్రతిపక్షా పార్టీలను వేధించడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తు వేళ అధికారం కోసం బిజెపి ఎంతకు తెగిస్తుందో ఈ అరెస్టుతో అర్ధమవుతుంది. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యకు వ్యతిరేకంగా ‘ఇండియా’ వేదిక ఐక్యంగా నిలుస్తుంది’ అని శరద్‌పవార్ తెలిపారు.
ఓటమి తప్పదన్న భయంతోనే… స్టాలిన్
‘దశాబ్దపు వైఫల్యాలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం’ కారణంగానే కేజ్రీవాల్ అరెస్టు జరిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వం జుగుప్సాకరంగా వ్యవహరించిందని ఆరోపించారు.