పోలింగ్‌కు ముందు యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి తొలగింపు
న్యూఢిల్లీ :
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిపై ఎన్నికల కమిషన్ అక్రమంగా వేటు వేసింది. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీపడుతున్న యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ అభ్యర్థి స్వాతి సింగ్ నామినేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు స్వాతిసింగ్‌కు ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ఈ నోటీసులను స్వాతిసింగ్ ఖండించారు. ఎలక్షన్ కమిషన్ చైర్‌పర్సన్ శైలేంద్ర కుమార్‌కు లేఖ రాశారు. ప్రధాన కార్యదర్శి పదవికి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల కమిటీ బహిరంగ నోటీసు ఇచ్చిందని పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభానికి కేవలం ఏడు గంటల ముందు ఈ నోటీసు ఇచ్చారని, శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు నోటీసులు ఇవ్వడమేమిటని ఆమె ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఎబివిపి లేఖ ప్రకారం.. ఇసి అధికారులు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈ చర్య అనైతికమని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని లేఖలో కోరారు. అయితే ఈ చర్యపై ఎన్నికల కమిషన్ స్పందించాల్సి వుంది.
అయితే ఆమె నామినేషన్ రద్దును ఖండిస్తూ యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చివరి క్షణంలో అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం తిరుగుబాటు చర్య అని పేర్కొంది. ప్రధాన కార్యదర్శి పదవికి ప్రియాంషి ఆర్య పేరును నామినేట్ చేసినట్లు వెల్లడించింది.
స్వాతి సింగ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ జెఎన్‌యులోని ఎబివిపి యూనిట్ సెక్రటరీ వికాస్ పటేల్ యూనివర్శిటీ డీన్‌కి ఫిర్యాదు చేశారు. లింగ్డో కమిటీ సిఫారసుల (ఎల్‌సిఆర్) నిబంధనల ప్రకారం.. ప్రొక్టోరియల్ జరిమానా విధించిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయలేరని ఫిర్యాదులో తెలిపారు.
ఐదేళ్లుగా జెఎన్‌యులో నిలిచిపోయిన విద్యార్థి సంఘం ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. 24న ఓట్ల లెక్కింపు. ప్రధాన పోటీ ఎబివిపి మరియు (ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, డిఎస్ఎఫ్) యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్‌ల మధ్య జరగనుంది. 7,751 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అధ్యక్షుని పదవికి 45, ఉపాధ్యక్ష పదవికి 43, జనరల్ సెక్రటరీకి 44, జాయింట్ సెక్రటరీకి 38, కౌన్సిలర్‌కు 258 నామినేషన్ పత్రాలు ఆమోదించబడ్డాయి. వామపక్ష కూటమి అధ్యక్షుడిగా ఐసాకు చెందిన ధనంజరు పోటీ చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎస్ఎఫ్ఐ అవిజిత్, జాయింట్ సెక్రటరీగా ఎఐఎస్ఎఫ్ చెందిన సాజిత్ జనరల్ స్థానాలకు ఇతర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.