నిన్న కారులో షికారుకెళ్ళి… నేడు చేతిలో చెయ్యేసి… అధికారం ఉంటే… నాయకగణం వెన్నంటే

నిన్న కారులో షికారుకెళ్ళి… నేడు చేతిలో చెయ్యేసి… అధికారం ఉంటే… నాయకగణం వెన్నంటే…

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కారు పైనే మక్కువ..

ఇప్పుడు అందరికీ హస్తమే సమస్తం..

షాద్ నగర్ లో రాజకీయ విలువలకు కొత్త అర్థం చెబుతున్న నాయకగణం

ఖుషి ఖుషీగా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ.. హుషారుగా కారెక్కుదాం.. కారులో షికారుకెళ్దాం.. కారు ఎక్కుదాం.. ప్రత్యర్థులను తొక్కుతాం.. ఇదంతా నిన్నటి మాట.. అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా దశాబ్ద కాలం పాటు కారు చూపించిన హుషారు ఇంత అంత కాదు.. జయమ్ము నిశ్చయమ్మురా.. భయమ్ము లేదురా.. జంకు, బొంకు లేక కదిలి సాగిపొమ్ము రా.. అంటూ వలస పెట్టి కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ చుట్టూ వ(ర)లస కట్టారు..

షాద్ నగర్ అసెంబ్లీలో జోరందుకున్న పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది ఉంటుంది కూడా..!

కట్ చేస్తే సీన్ రివర్స్..

అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది.. ఆ పార్టీకి కొత్త వెలుగు వచ్చింది.. ఆనందమానందమాయే.. మరి ఆశల నందన మాయే.. మాటలు చాలని హాయే.. అంటూ ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వారంతా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే పార్టీని వీడి ఎన్నికల ముందు పార్టీ మారిన వారంతా అంతా బ్రాంతియేనా.. జీవితానా వెలిగింతేనా.. ఆశా నిరాశేనా.. మిగిలింది చింతేనా.. అని విషాద గీతాలు పాడుతూ నిరసించిపోయారు.. కొందరు నాయకులు తీరు మాత్రం ఇందుకు భిన్నం.. నువ్వెక్కడుంటే నేనక్కడుంటా.. నేను వీడని నీడను నేను.. అంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే చటక్కున ఆ పార్టీ పంచన చేరడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి నాయకులు ఎవరేమన్నను.. తోడు రాకున్నా.. ఒంటరిగానే పోరా బాబు పో.. అంటూ అధికార పార్టీ చంకనెక్కుతున్నారు.. ప్రస్తుతం పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల రావడంతో గుండె గూటికి పండుగ వచ్చింది.. పండు వెన్నెల పంచుకో మంటుంది.. అంటూ కారుకు హ్యాండ్ ఇచ్చి.. చెయ్యికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.. దీనితో ప్రతిపక్ష నాయకులు ఇంతేనయా తెలుసుకోవయా.. ఈ లోకం ఇంతేనయా.. నీతి లేదు నిజాయితీ లేదు ఇదేం ప్రపంచమయ్యా.. అని ఆవేశంతో ఊగిపోతున్నారు. గతంలో అంచనాలు తప్పి ఓడిపోయిన పార్టీలోకి వెళ్ళిన నాయకులు మాత్రం తిరిగి వచ్చే ముఖం లేక తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.. అంటూ నిట్టూరుస్తున్నారు. అదే మరి రాజకీయమంటే..!