లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్… రూ.1700 కోట్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
న్యూఢిల్లీ :
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అందజేసిందని కాంగ్రెస్ పార్టీ గురువారం (మార్చి 29) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాలుగు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్తంభించిన బ్యాంకు ఖాతాల వల్ల నగదు కొరత ఏర్పడింది.
మరోవైపు తాజా నోటీసులతో కాంగ్రెస్ ఇరకాటంలో పడ్డట్లైంది. దెబ్బ మీద దెబ్బ పడటంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం ఐటీ నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ లాయర్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని, అసమంజసమైనదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ఇదంతా చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామన్నారు.
కాగా 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ గత వారం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌లో కాంగ్రెస్ పార్టీ 2014-15 నుంచి 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను నిలిపివేయాలని కోరుతూ సవాలు చేసింది. ఈ పిటిషన్ల విచారణ సమయంలో ఈ మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్లు మదింపు నుంచి తప్పించుకున్నట్లు పన్ను శాఖ వాదించింది. ఐటీ శాఖ ఖచ్చితమైన సాక్ష్యాలను సమర్పించినందున న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషైంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటీషన్లను కొట్టేంది. 2014-15 నుంచి 2016-17 వరకు ఐటీ పన్నులకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు తాజా పిటిషన్‌కు కూడా వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇక 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను బకాయిలు, వడ్డీలకు సంబంధించి కాంగ్రెస్ ఢిల్లీ బ్యాంక్ ఖాతాల నుంచి ఇప్పటికే రూ.135 కోట్లను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది.