సి – విజిల్ కు తాకిడి… రెండు వారాల్లోనే 79వేల ఫిర్యాదులు
లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోన్న ఎన్నికల సంఘం అనేక మార్గాల్లో పౌరులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగా ‘సీ-విజిల్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా 79వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది.
”ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనలపై (MCC) 79వేల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో దాదాపు 99శాతం సమస్యలను పరిష్కరించాం. 89శాతం కేసులను 100 నిమిషాల్లోనే పూర్తిచేశాం. 58,500 ఫిర్యాదులు అక్రమ హోర్డింగులు, బ్యానర్ల గురించే వచ్చాయి. నగదు, తాయిళాలు, మద్యం పంపిణీకి సంబంధించి 1400లకుపైగా కంప్లెయింట్‌లు వచ్చాయి. స్థలాల అక్రమ వినియోగం, మారణాయుధాలతో బెదిరింపులు, సమయం ముగిసిన తర్వాత ప్రచారం వంటి ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చాయి” అని ఈసీ తెలిపింది. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సీ-విజిల్ అనేది పౌరుల చేతుల్లో ఉన్న సమర్థమంతమైన సాధనమని పేర్కొంది.
ఇదిలాఉంటే, సీ-విజిల్ అనేది ఎన్నికల సంఘం రూపొందించిన ఫాస్ట్ ట్రాక్ మొబైల్ యాప్. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనలపై సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. వీటిని ఈసీ నిమిషాల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ, తాయిలాలతో ప్రలోభపెట్టడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, అసత్యాలు ప్రచారాలకు సంబంధించి ఏవైనా ఫొటోలు, వీడియోలు ఈ యాప్ ద్వారా ఈసీకి పంపించవచ్చు. మొత్తం మీద 100 నిమిషాల్లో ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.